కర్నూలు ఆస్పత్రి నుంచి అవినాష్ తల్లి డిశ్చార్జ్- హైదరాబాద్ కు తరలింపు ?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంపాలైన తన తల్లి శ్రీలక్ష్మిని చూసుకునేందుకు గత వారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన అవినాష్ రెడ్డి అప్పటి నుంచి కర్నూలు ఆస్పత్రిలోనే ఉండి ఆమెను చూసుకుంటున్నారు. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడిందని కర్నూలు ఆస్పత్రి ప్రకటించింది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడింది. దీంతో ఆమెను ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నట్లు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితం ఆమె డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు మరింత మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాల్సి ఉందని ఈ ప్రకటనలోనే తెలిపింది. దీంతో అవినాష్ తల్లిని ఇవాళ హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

మరోవైపు తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు హాజరు కాని అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు సిద్ధమైంది. వాస్తవానికి నిన్న విచారణ జరగాల్సి ఉండగా.. ఆలస్యం కావడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు తెలంగాణ హైకోర్టులో ఈ విచారణ ప్రారంభమైంది.

తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో ఉండటం, తల్లి అనారోగ్యం కారణంగా ఆమెను చూసుకోవాల్సి ఉందని అవినాష్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ జరిపి హైకోర్టు ఇవాళ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆలోపు కర్నూలు ఆస్పత్రి నుంచి తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ కు తరలిస్తే హైకోర్టు తాజా ఆరోగ్య పరిస్ధితి ఆధారంగా అవినాష్ ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications