తెలుగుదేశం పార్టీలో 'కన్నా' కూడికలు, తీసివేతలు, భాగాహారాలు!
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజ రాజకీయవేత్త అయిన కన్నా లక్ష్మీనారాయణ రోశయ్య రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికోసం పోటీపడ్డారుకానీ త్రుటిలో తప్పిపోయింది. ఆ స్థాయికి వెళ్లిన కాపు సామాజికవర్గ నేత కూడా ఆయనే. తనకంటూ ఒక అనుచరవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న కన్నా మారిన పరిణామాల్లో విభజన అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీ నుంచి టీడీపీ గూటికి..
ఆయన స్థాయికి తగినట్లుగా రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. ఆ సమయంలో కొన్ని జిల్లాలకు అధ్యక్షులను, అనుబంధ విభాగాలకు నాయకులను ఎంపిక చేశారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత వారందరినీ తప్పించారు. దీంతో కన్నా విభేదించి బీజేపీ నుంచి బయటకు వచ్చారు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులాంటి నేతలవల్ల రాష్ట్రంలో పార్టీ ఎగదలేదని, అందులో ఉంటే వారివల్ల తాము కూడా ఎదగలేమని భావించిన కన్నా తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. వాస్తవానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థుల్లో కన్నా ప్రధానమైనవారు. అటువంటి కన్నా టీడీపీలో చేరడమే రాజకీయ వైచిత్రం.

పార్టీలో కీలకస్థానానికి..
చంద్రబాబునాయుడితో మాట్లాడిన తర్వాత 23న పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తన అనుచర గణంతో భారీగా చేరబోతున్నారు. సీనియర్ రాజకీయవేత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో తన హవాను మరోసారి చూపించాలని ఆయన తహతహలాడుతున్నారు. అందుకు సరైన వేదిక తెలుగుదేశం పార్టీ అని గ్రహించి అందులోకి చేరుతున్నారు. కన్నా సీనియారిటీకి తగినట్లుగానే తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ స్థానానికి చేరుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాలయ చినరాజప్ప, వంగవీటి రాధా, బొండా ఉమా తదితర నాయకులకు తమ ప్రాధాన్యం తగ్గుతుందేమోననే గుబులు మొదలైందంటున్నారు.

ఎవరి ప్రాధాన్యం వారిదే..
కాపు సామాజికవర్గం తరఫున టీడీపీలో ప్రధానంగా నిలవబోయేది కూడా కన్నా లక్ష్మీనారాయణే అని అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ముఖ్య భూమిక పోషిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదంటూ ఇప్పటివరకు జెండా మోసినవారి గుండెల్లో గుబులు రేకెత్తుతోంది. అయితే చంద్రబాబునాయుడు ఎవరి ప్రాధాన్యాన్ని వారికిస్తారనడటంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. టీడీపీ ప్రభుత్వం వస్తే కన్నాకు కీలకమైన పదవి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన సామాజికవర్గంతోపాటు జిల్లావ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అనుచరులంతా టీడీపీలో చేరడంవల్ల పార్టీకి ప్లస్ పాయింటే అవుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications