కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టిన పవన్: ప్యాకేజీ నిజమే: హరిరామ
Pawan Kalyan: కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గళం విప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కల్యాణ్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చిన ఈ సీినియర్ నేత.. ఒక్కసారిగా జనసేనానిపై నిప్పులు చెరిగారు.
మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తూ లేఖాస్త్రాన్ని సంధించారు హరిరామ. తెలుగుదేశం పార్టీతో అధికారాన్ని, ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని పంచుకోవడంపై తలెత్తిన అనుమానాలన్నింటినీ ఆయన ఈ లెటర్‌లో పొందుపరిచారు. తెలుగుదేశం- జనసేన అధికారంలోకి వస్తే అయిదు సంవత్సరాల కాలం పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ నారా లోకేష్ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు.

దీనిపై ఇప్పటివరకు కూడా అటు పవన్ కల్యాణ్ గానీ, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గానీ స్పందించలేదు. హరిరామ జోగయ్య తమను ఉద్దేశిస్తూ ఓ లెటర్ రాశారన విషయాన్ని వారు పట్టించుకోనట్టే వ్యవహరించారు. ఆయనకు ఎలాంటి బదులు ఇవ్వలేదు.
దీనిపై హరిరామ తాజాగా మరో లేఖ రాశారు. ఈ సారి కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఈ లెటర్ రాశారాయన. పవన్ కల్యాణ్‌ను ఏకిపడేశారు. పవన్ కల్యాణ్ వైఖరి వల్ల కాపు సామాజిక వర్గీయులు తమ రాజకీయ ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తోంటే బాధ కలుగుతోందని, కాపుల ఉనికికే ముప్పు తెచ్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. కాపులను మరింత ఆత్మరక్షణలో నెట్టేసేలా ఉన్నాయే తప్ప ఏ మాత్రం మేలు చేసేవిలా లేవని తేల్చి చెప్పారు హరిరామ. ఇన్ని సంవత్సరాలుగా కాపులను వాడుకుని కరివేపాకులా బయటపడేశారంటూ ఆయన విమర్శించారు.
చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవడానికి కాపులు సిద్ధంగా లేరని హరిరామ స్పష్టం చేశారు. వంగవీటి రంగా తరువాత ఆ స్థాయిలో కాపులకు రాజకీయంగా అండగా ఉంటాడని భావించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు పంచన చేరడం కాపు సామాజిక వర్గానికి అత్యంత అవమానకరంగా మారిందని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్నిచంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టాడంటూ హరిరామ ధ్వజమెత్తారు. కాపులకు పవన్ కల్యాణ్ ఏదో చేస్తాడనే ఆశతో ఇన్నాళ్లూ ఆయనను నమ్ముకున్నామని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తోంటే ప్యాకేజీ ఆరోపణలను నిజమేననిపిస్తోన్నాయని అన్నారు.
పొత్తుతో ఉన్న పార్టీని కనీసం సంప్రదించకుండా అయిదు సంవత్సరాల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ నారా లోకేష్ ఎలా ప్రకటిస్తారని హరిరామ నిలదీశారు. చంద్రబాబు అనుమతి లేకుండానే నారా లోకేష్ ఈ ప్రకటన చేశారా? అంటూ ప్రశ్నించారు. కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి బాబు చేస్తోన్న కుట్ర అని ధ్వజమెత్తారు.
ఇక ఉపేక్షించడం వల్ల ఎలాంటి లాభం లేదని, కాపులు సమైక్యంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని హరిరామ అన్నారు. అధికారంలో వాటా కోసం ఉద్యమించక తప్పదనీ పేర్కొన్నారు. ఈ విషయంలో కాపు నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications