జగన్ ను కొట్టాలంటే అస్త్రమిదే- టీడీపీ-జనసేనకు జోగయ్య పీపుల్స్ మ్యానిఫెస్టో- 47 పథకాలతో..
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకవుతున్న వేళ వారికి కాపు నేత హరిరామజోగయ్య కీలక అస్త్రం అందించారు. రూ.75 వేల కోట్ల ఖర్చయ్యే 47 పథకాలతో పీపుల్స్ మ్యానిఫెస్టోను ఇవాళ ఆయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విడుదల చేసారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. టీడీపీ-జనసేన ఈ అస్త్రం అందుకుంటే జగన్ ను గద్దె దింపొచ్చని ఆయన సూచించారు.
ఎన్నికల సమీప కాలంలో తెలుగుదేశం, జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందని హరిరామ జోగయ్య అంచనా వేశారు.వైసీపీ రాక్షస పాలన అంతమొందించాలంటే టీడీపీ-జనసేన కూటమికి జనరంజకమైన ఉమ్మడి మేనిఫెస్టో ఎంతో అవసరమని ఆయన తెలిపారు. వైసీపీకి సంక్షేమ పథకాలను జనసేన కూటమి సంక్షేమ పథకాలతోనే తిప్పి కొట్టాలన్నారు. అన్ని వర్గాలకు చెందిన పేదలతో చర్చించి మేనిఫెస్టో ఖరారు చేసామన్నారు. 20 మందితో కమిటీని వేసి వారందరి అభిప్రాయాలతో తయారు చేసిన పీపుల్స్ మేనిఫెస్టో ముసాయిదాను జనసేన నేత నాదెండ్లల మనోహర్ కు అందజేసినట్లు ఆయన తెలిపారు.

తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే సంక్షేమం పథకాలు ఆందాలని ఈ మ్యానిఫెస్టోలో ప్రతిపాదించినట్లు జోగయ్య తెలిపారు.కుటుంబ పోషణ నిమిత్తం ప్రతీ పేద కుటుంబానికి నెల నెలా రూ. 5 వేలు సహాయం ఇవ్వాలని సూచించారు. ప్రతీ ఆడపిల్లకు పెళ్ళి కానుకగా రూ. 3 లక్షలు అందివ్వాలని సూచించామన్నారు. రాష్ట్రంలో రూ. 75 వేల కోట్ల అంచనా గల 47 సంక్షేమ పథకాలతో పీపుల్స్ మేనిఫెస్టో బుక్ లెట్ విడుదల చేశారు.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే టీడీపీతో కలిసి పోటీ చేయాలని కోరుతున్న హరిరామజోగయ్య... వీరికి మద్దతుగా ఇప్పుడు మ్యానిఫెస్టో తయారు చేయించి మరీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఉమ్మడి మ్యానిఫెస్టో కసరత్తులో ఉన్నటీడీపీ-జనసేన జోగయ్య ఇచ్చిన మ్యానిఫెస్టోలో ప్రతిపాదనలను ఏమేరకు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications