వాడుకుని వదిలేస్తున్నారు - మీరే మంచిగా ఆలోచన : సీఎం జగన్ కు ముద్రగడ లేఖ..!!
ముఖ్యమంత్రి జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాసారు. కాపు రిజర్వేషన్ల పైన వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. గత రెండు నెలల కాలంలో ముద్రగడ సీఎం జగన్ కు రెండు సార్లు లేఖలు రాసారు. కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో భాగంగా కాపులకు అయిదు శాతం కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంట్ లోనూ ఏపీలో కాపు రిజర్వేషన్ల అమలు పైన బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రస్తావించారు. దీనికి కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.
గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముద్రగడ లేఖ రాయగా.. మరో నేత చేగొండి హరిరామ జోగయ్య దీక్షకు ప్రయత్నించారు. ఇప్పుడు తాజాగా ముద్రగడ రాసిన లేఖలో కోరారు. కాపు,తెలగ,బలిజ, ఒంటరి కులస్థుల రిజర్వేషన్ల కోసం ఎందరో పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న విషయాన్ని సీఎంకు గుర్తుచేశారు. పోరాటాలకు ముగింపు పలికే విధంగా మీ చర్యలు ఉండాలని కోరుకుంటున్నాని ముద్రగడ తన లేఖలో తెలిపారు. రైలు, బస్సు వెళ్లిపోయిన తర్వాత ప్రయాణికులు వెళ్లినట్లుగా మీ నిర్ణయం ఉండకూడదని ముద్రగడ సీఎం జగన్ ను కోరారు.

కాపు, తెలగ, బలిజ, వంటరి కులాలకు చెందిన ప్రజలను అనేక పార్టీల వారు వాడుకుని వదిలేస్తున్నారని ముద్రగడ తన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇంచుమించు అన్ని పార్టీల వారు అదే విధంగా వాడుకుని వదిలేస్తున్నారని సీఎం జగన్ కు తెలిపారు. నది దాటిన తర్వాత పడవను తగులబెట్టిన చందంగా అన్ని పార్టీలు వ్యవహరించాయని, మీరు అలా చేయవద్దని సీఎం జగన్ ను ముద్రగడ కోరారు. కాపుల కోరిక సమంజసమని మీరు చాలా సందర్భాల్లో అన్నట్లు తాను విన్నానని ముద్రగడ సీఎంకు లేఖలో వివరించారు. చాలా మంది కాపు నాయకుల కన్నా మీరు మంచిగా ఆలోచిస్తున్నారని విన్నానని ముద్రగడ వివరించారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయమని మరోసారి కోరుతున్నానని ముద్రగడ సీఎం జగన్ ను కోరారు.












Click it and Unblock the Notifications