కాపు రిజర్వేషన్లు: చంద్రబాబుకు మరో సవాల్, ఏకమైన యాదవులు
విజయవాడ: కాపు రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో సవాల్ ఎదురవుతోంది. కాపులను బిసీల్లో చేరిస్తే సహించబోమంటూ తాజాగా యాదవ మహాసభ హెచ్చరించింది. కాపులను బిసి జాబితాలో చేరిస్తే పోరాటం తప్పదంటూ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు రామనంద యాదవ్, జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నత్తు నరేంద్రయాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ హెచ్చరించారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హంగు, ఆర్భాటం కలిగిన కాపులను బిసి జాబితాలో చేర్చటం వల్ల ప్రధానంగా స్థానిక సంస్థల్లో బిసిలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందని వారు అభిప్రాయపడ్డారు. వంద మందితో ఏర్పాటైన అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం విజయవాడ నగరంలో జరిగింది.
దీనికి జాతీయ నాయకులు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై రాష్ట్రంలో యాదవ మహాసభ అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. రామానంద యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్న యాదవులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని, అలాగే యాదవుల హక్కుల కోసం నిరంతరం పోరాడి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు.

రాష్ట్రంలో యాదవుల అభివృద్ధికి జాతీయస్థాయిలో తమ వంతు పూర్తి సహాయ సహకారాలుంటాయని జాతీయ నాయకులు లల్లూప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌ల వంటి సహాయ సహకారాలు లభించగలవని జాతీయ సెక్రటరీ జనరల్ అశోక్‌కుమార్ అన్నారు.
కాపులను బిసి జాబితాలో చేరిస్తే యుపిలో గతంలో జయప్రకాష్ నారాయణ్, ములాయం సింగ్, కాన్షీరాం వంటివారు చేపట్టిన ఉద్యమాల తరహాలో ఇక్కడ కూడా ఉద్యమాలు చేపడుతామని జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.
యాదవులు సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం యాదవ మహాసభ నిరంతరం పాటుపడుతుందని రాష్ట్ర నూతన అధ్యక్షుడు లాగా వెంగళరావు యాదవ్ అన్నారు. కాపులు బిసి రిజర్వేషన్లలో పోటీచేస్తే స్థానిక సంస్థల్లో బిసి జాబితాలో ఉన్న 120 కులాలకు స్థానం లేకుండా పోతుందన్నారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, రాష్ట్ర నాయకులు ప్రత్యూష సుబ్బారావు, అశోక్ సామ్రాట్, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, ప్రకాశం జడ్‌పి వైస్ చైర్మన్ బాలాజీ యాదవ్, వివిధ జిల్లాల నాయకులు ప్రసంగించారు.












Click it and Unblock the Notifications