TTD: శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం - టీటీడీ తాజా నిర్ణయం..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తాజాగా పాలక మండలి దర్శనం .. లడ్డూ ప్రసాదం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులు కోరినన్న లడ్డూలు అందు బాటులో ఉంచాలని నిర్ణయించింది. అదే విధంగా సామాన్యుల భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇక, తిరుమల లో రేపు (ఆదివారం) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ధనుర్మాసం ప్రారంభ వేళ శ్రీవారి ఆలయంలో ఈ నెలంతా సుప్రభాతం బదులు తిరుప్పావై నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15 తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి వద్ద దీపాలను ఏర్పాటు చేయనున్నారు.

అదే విధంగా వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, రంగనాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన టీడీడీ.. 15వ తేది సహస్రదీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ఇక, పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2025 జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.












Click it and Unblock the Notifications