హైటెక్ సిటీపై బాబుది బడాయే, విద్యార్థుల కృషే: కవిత
నిజామాబాద్/హైదరాబాద్: విద్యార్థుల కృషితోనే హైదరాబాద్ హైటెక్ సిటీగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె గురువారం తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై నిజామాబాద్‌లో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తానే హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అయితే అది కాస్తా మెంటల్ గేమ్‌గా తేలిపోయిందని కవిద ఎద్దేవా చేశారు.

జయశంకర్ సార్ కల తెలంగాణ: అన్నపూర్ణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కల అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అన్నపూర్ణ అన్నారు. ఆమె గురువారం తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడుతూ.. జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మాట్లాడిన తీరు బాధాకరమని ఆమె అన్నారు. తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. అన్ని రంగాల్లో వివక్షతకు గురైనందు వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామని స్పష్టం చేశారు.
తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే తాము తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామని మరో ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కావేటి సమ్మయ్య అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని ఆయన అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications