సిఎం సీటుకోసం మాయమాటలు చెప్పారు: టిపై కావూరి
ఏలూరు: ముఖ్యమంత్రి పదవి కోసమే కొందరు రాష్ట్ర విభజనకు అంగీకరించారని కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు అధిష్టానానికి మాయమాటలు చెప్పి విభజన వైపు మొగ్గేలా చేశారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు ప్రాంతాలకు నష్టమేనన్నారు. విభజనను అడ్డుకునేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమే అన్నారు. విభజన సరికాదని, దీనిని తాను ఎప్పటికప్పుడు కేబినెట్ సమావేశాలలో అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తున్నానని చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన విషయమై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లకు లేఖలు రాసిన విషయం తెలియదన్నారు. తమ పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిందన్న మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. కుమ్మక్కు వ్యాఖ్యలు అవాస్తవమన్నారు.
తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నాననిచెప్పారు. అధిష్టానం, కేబినెట్ సమావేశాల్లో పలుమార్లు తాను సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించానన్నారు. పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి సాయం చేస్తామని కావూరి చెప్పారు.












Click it and Unblock the Notifications