రాయల టీపై కెసిఆర్ ఫైర్, 5న తెలంగాణ బంద్
హైదరాబాద్: రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన ఆయన తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. సంపూర్ణ తెలంగాణ కోసం అవసరమైతే యుద్ధం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగే రోజున తమ ప్రతిస్పందన వెళ్లాలనే ఉద్దేశంతో తెలంగాణ బంద్‌కు అదే రోజు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 4,5,6 తేదీల్లో తలపెట్టిన పార్టీ శిక్షణా శిబిరాలను రద్దు చేసి, ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా 4వ తేదీన గ్రామగ్రామాన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 6వ తేదీన తమ పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం జరుగుతుందని, కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని బట్టి తమ కార్యాచరణను అదే రోజు రూపొందించుకుంటామని, ఆ రోజంతా పోలిట్‌బ్యూరో సభ్యులు తెలంగాణ భవన్‌లోనే ఉంటారని ఆయన చెప్పారు.

తాను ఇంత కాలం మౌనంగా ఉన్నానని, ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఉల్టా పల్టా మాట్లాడడం సరి కాదని మౌనంగా ఉన్నానని, ఈ స్థితిలో కూడా తాను ప్రతిస్పందించకపోతే తనదే తప్పు అవుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం సహా మరిన్ని విషయాల్లో తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. తమకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని ఆయన అన్నారు. సిబ్ల్యుసి, కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు మార్చి మసి చేసి మారేడు కాయ చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. శ్రీకాంతాచారి మొదలుకుని తెలంగాణ యువకులు పది జిల్లాలతో కూడిన తెలంగాణ కోసమే ప్రాణత్యాగాలు చేశారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తాము మాట్లాడుతామని, తెలంగాణపై ఏ విధమైన షరతులను అంగీకరించబోమని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనేదే లేదని, అయితే తాము దాన్ని గౌరవించడానికి సిద్ధపడ్డామని ఆయన అన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు మద్రాసుపై లేని ఆంక్షలు హైదరాబాదుపై ఎందుకని ఆయన అడిగారు. మద్రాసులో ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నవారి కన్నా ఎక్కువ మంది అప్పట్లో తెలుగువారున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ దోపిడీకి, వివక్షకు, అన్యాయానికి, దుఖ్కానికి గురైందని, అందుకే తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేశామని, తాము దేని కోసం పోరాటం చేశామో అదే కావాలని ఆయన అన్నారు. తాము రాయల తెలంగాణ కోసం పోరాటం చేయలేదని ఆని అన్నారు. తెలంగాణ తన సమస్యను పరిష్కరించాలని పోరాడిందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సమస్యలను పరిష్కరిస్తోందా, సీమాంధ్ర సమస్యను పరిష్కరిస్తోందా అని అడిగారు. విభజన వల్ల ఆంద్రకు ఏమైందని, కర్నూలు రాజధానిగా రాష్ట్రం అప్పట్లో ఏర్పడిందని, వారు వెనక్కి వెళ్తారని, పరిష్కరించాల్సింది తెలంగాణ సమస్య అని ఆయన అన్నారు.
తెలంగాణ ఏర్పడితే 29వ రాష్ట్రం అవుతుందని, ఇప్పటి వరకు ఉన్న 28 రాష్ట్రాలకు, కేంద్రానికి ఉండే సంబంధాలు తెలంగాణకు ఉండాలని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునే వరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా తాము అంగీకరించామని, దాన్ని అలుసుగా తీసుకుని హైదరాబాద్ శాంతిభద్రతలు, మండలి వంటివి తేవడం తమను అవమానించడమేనని ఆయన అన్నారు. హైదరాబాద్ విషయంలో వితండవాదనను, తెలివి తక్కువ వాదనను చేస్తున్నారని ఆయన అన్నారు.
ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా తాము రాయల తెలంగాణను అంగీకరించబోమని కెసిఆర్ అన్నారు. మరో యుద్ధానికి సిద్ధమవుతామని ఆయన అన్నారు. ఐదో తేదీ బంద్‌ను స్వచ్ఛందంగా పాటించాలని ఆయన తెలంగాణకు చెందిన అన్ని వర్గాలను కోరారు.












Click it and Unblock the Notifications