పొగడుతారు: జానాకు కేసీఆర్, పీవీపై ధైర్యం చేశారని...
హైదరాబాద్: వచ్చే బడ్జెట్ నాటికి తమను మీరే పొగుడుతారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు. అద్భుతంగా బాగుపడదామనే తెలంగాణ సాధించుకున్నామని, వంద శాతం అద్భుతాలు నిజమవుతాయన్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత జానా రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా ఉంనద్నారు. ప్రజలను గందరగోళపర్చవద్దని, వారికి వాస్తవాలు చెప్పాలన్నారు. ఏ బ్యాంకు ఎంత అప్పు ఇస్తుందో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో మిగులు బడ్జెట్ కొనసాగించామన్నారు.
ఏపీ లోటు బడ్జెట్‌తో ప్రారంభమైతే, తెలంగాణ రూ.2,545 కోట్ల మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైందన్నారు. రూ.17,398 కోట్ల ఆర్థిక లోటును అంచనా వేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఆశించిన మేరకు వస్తాయని చెబుతున్నారని, మీరు ప్రవేశ పెట్టిన పథకాలకు నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు ఎంత అప్పు తెచ్చారని, మరో నాలుగు నెలల్లో ఎంత తెస్తారని ప్రశ్నించారు. అప్పుతెచ్చే లోగా పుణ్యకాలం పూర్తవుతుందన్నారు. భూములు అమ్మితే రూ.6500 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చెప్పారని, ఈ ఐదు నెలల్లో ఎన్ని భూములు అమ్మి అంత డబ్బు తెస్తారన్నారు. పేదలకు డబుల్ రూం కట్టించాలన్నారు. భూపంపిణీ ఐదేళ్లలో ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
సరైన అధ్యయనం చేయకుండానే బడ్జెట్ తయారు చేసినట్టుందని, సరైన లెక్కలు లేవన్నారు. బడ్జెట్లో పొందుపరిచిన వివరాలన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు. పక్క రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు దాటిందనే ఆలోచనతో మీరు కూడా లక్ష కోట్లు దాటించారా? అంటూ ప్రశ్నించారు. అద్భుతాలు సృష్టిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పుకోవడం సరికాదని, ఏదైనా చేతల్లో చూపిస్తేనే బాగుంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలనను తప్పుబడుతున్న తెరాస ప్రభుత్వానికి వృద్ధి రేటుపై స్పష్టత లేదన్నారు. 2004-14 మధ్యకాలంలో గణనీయమైన వృద్ధిని సాధించామని, గుజరాత్ కంటే ఎక్కువ అభివృద్ధిని నమోదు చేశామన్నారు. తమ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం కూడా పెరిగిందన్నారు.
దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్ నాటికి మీరే మమ్మల్ని పొగుడుతారన్నారు. ఇన్నాళ్లు మూసలో చూసిన వారికి ప్రతిదీ అద్భుతంగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కనివినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఎఫ్ఆర్‌బీఎంపై మాట్లాడుతూ.. కేంద్రం పెంచితేనే అది పెరుగుతుందన్నారు.
స్టేట్ ఓన్ టాక్స్ మీద 90 శాతం లోన్ తీసుకునే అవకాశముందని చెప్పారు. 3 శాతం నుండి ఎఫ్ఆర్‌బీఎం పెంచాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరామన్నారు. తాము చెప్పినట్లుగా వంద శాతం అద్భుతాలు జరుగుతాయన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వం విశ్రమించదని ఈటెల రాజేందర్ అన్నారు. 57 ఏళ్లు తెలంగాణ అన్యాయానికి గురైందని, 14 ఏళ్లు పోరాడి సాధించుకున్నామన్నారు.
పీవీపై రగడ
జానా తన ప్రసంగంలో పీవీ నర్సింహా రావు పేరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు పీవీ పేరును ఉచ్చరించే సాహసం కాంగ్రెస్ నేతలు చేయలేకపోయారని, ఇప్పటికైనా ఆ పేరు పలికినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. ఓ మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపారన్నారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత ఇవ్వలేదని, తాము తెలంగాణ వ్యక్తి కాబట్టి భారతరత్నకు సిఫార్సు చేశామన్నారు.
వారి పార్టీ నాయకున్ని వారే మరిచిపోయారన్నారు. కాబట్టి తాము వారు చేయలేని పనిని చేస్తున్నామని చెప్పారు. మా తెలంగాణ బిడ్డ కాబట్టి మేం గౌరవిస్తున్నామని, రాజకీయం కోసం చేయడం లేదన్నారు. పీవీ శవాన్ని పూర్తిగా కాల్చకుండానే వెళ్లిపోయారన్నారు. వారు మాట్లాడే ప్రతి మాటకు తమకు సమాధానం చెప్పే సత్తా ఉందని చెప్పారు. పీవీ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చుతున్నామన్నారు.
దీనిపై జానా మాట్లాడుతూ.. తాము పీవీని ప్రధానిగా చేశామన్నారు. దీనిపై జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ పార్టీకి పీవి తప్ప మరొకరు గతి లేరని, అందుకే ఆయనను ఐదేళ్లు వాడుకున్నారన్నారు. ఆ తర్వాత వదిలేశారన్నారు. ఏఐసీసీ కార్యాలయానికి కూడా ఆయన భౌతికకాయాన్ని తీసుకు వెళ్లలేదన్నారు. పీవీ పైన కేసులు పెట్టి వేధించారని హరీష్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications