కెసిఆర్‌కు ప్రణబ్ ఆత్మీయ పలకరింపు, పాదాభివందనం
హైదరాబాద్: తనను కలిసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆత్మీయంగా పలకరించారు. దాదాకు కెసిఆర్ పాదాభివందనం చేశారు. గురువారం రాత్రి కెసిఆర్ ప్రణబ్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. రావుగారూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత... అంటూ రాష్ట్రపతి పలకరించారు. కెసిఆర్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, పాదాభివందనం చేశారు. కెసిఆర్‌ను దాదా ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు.
తెలంగాణకు న్యాయం చేయాలని కెసిఆర్ వినతిపత్రం ఇచ్చారు. పదిహేను నిమిషాలు కెసిఆర్ మాట్లాడారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులోని పలు అంశాలపై తమ అభ్యంతరాలు వివరించారు. బిల్లులో సవరణ చేయాల్సిన అంశాలను ఏకరవుపెట్టారు. గవర్నర్‌కు అధికారాలివ్వడం, ఉద్యోగులు-పెన్షనర్ల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలకున్న అధికారాలనే తెలంగాణ రాష్ట్రానికీ ఇవ్వాలని, పలు విషయాల్లో ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. అప్పుల్లో 29 శాతమే తెలంగాణ వాటా అని వారు వివరించారు.

బిల్లుపై శాసనసభలో చర్చ జరగకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకుంటున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. చర్చకు గడువు పెంచవద్దని కూడా కోరారు. అనంతరం తెరాస నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు సాకారమవుతున్న దశలో సీమాంధ్ర నేతలు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, విభజనను ఆపడం సాధ్యం కాదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సభలో బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకుంటూ వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి అధినేతలు కుట్ర చేస్తున్నారని, అవన్నీ రాష్ట్రపతికి వివరించామన్నారు.
జగన్, చంద్రబాబు అంతా శాసనసభలో చర్చ జరగకుండా చూస్తున్నారని, విభజన బిల్లు సభకు వచ్చిన దశలో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనో, ఉంటుందనో ఎవరైనా మాట్లాడితే అది తెలివితక్కువ తనం అనిపించుకుంటుందన్నారు. వారి ప్రాంతానికి ఏం కావాలో తెలియజేయాలన్నారు. ఇంకా సమైక్యం అంటున్నారంటే సీమాంధ్రలో రాజకీయంగా లబ్ధిపొందడానికి మాట్లాడే మాటలే తప్ప వేరేకాదని హరీశ్ అన్నారు.
చర్చ జరగకుండా 14 రోజులు వాయిదా వేసి పారిపోయిన సీమాంధ్ర ఎమ్మెల్యేలకు గడువు పెంచమనే హక్కు లేదన్నారు. దీనిపై రాష్ట్రపతికి వివరించామని, రోజుకు 18 గంటలు, సంవత్సరం అయినా చర్చిద్దామని చెప్పినా వారు పారిపోయారని మండిపడ్డారు. అలాంటి వారికి గడువు పెంచమనే హక్కు లేదన్నారు. వారి మాటలు చర్చను అడ్డుకోవడానికే, గడువు పెంచమనే దానిలో నిజాయతీ లేదన్నారు. తమకు రాష్ట్రపతిపై విశ్వాసం ఉందన్నారు.












Click it and Unblock the Notifications