రాష్ట్ర రాజకీయం టీడీపీతోనే..!! దేశ రాజకీయం టీడీపీతోనే..!!
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి తెలగాణలోనే కార్యకర్తల బలం ఎక్కువ. విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగలిగింది. వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పాగా వేసింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దిన కేసీఆర్ స్వరాష్ట్రంలో ఆ పార్టీ బలాన్ని తన టీఆర్ఎస్‌వైపు తిప్పుకొని బలోపేతమయ్యారు. ప్రస్తుతం దేశంలో ఆర్థికంగా అతి బలమైన పార్టీగా టీఆర్ఎస్ రూపుదిద్దుకుంది.

టీడీపీ బలాన్ని టీఆర్ఎస్ వైపు మళ్లించేలా..
తాజాగా టీఆర్ఎస్ పార్టీ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చెందింది. తెలంగాణకు పొరుగునే ఉన్న ఆంధ్రాలో బీఆర్ఎస్ ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ మొదలైంది. ఇక్కడ కూడా కేసీఆర్ చంద్రబాబును దెబ్బకొట్టాలని చూస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీడీపీ బలాన్ని బీఆర్ఎస్ వైపు మళ్లించేలా ప్రణాళికలు రచించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ ని దాదాపుగా నేలమట్టం చేశామని, ఆ పార్టీకున్న నాయకులు, కార్యకర్తల బలాన్ని తమవైపు తిప్పుకున్నామని ఆ పార్టీశ్రేణులు భావిస్తున్నాయి.

ఏపీలో పాగా వేస్తేనే ప్రయోజనం
జాతీయ పార్టీగా ఎదగాలంటే ముందుగా పొరుగునే ఉన్న ఏపీలో పాగా వేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. రాష్ట్రంలో కులాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రకారమే రాజకీయం చేసి పునాది వేసుకోవాలని చూస్తున్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు పూర్తిగా ఏపీపైనే దృష్టిసారించారు. అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోవడమే కాకుండా నాయకులు, కార్యకర్తలను కూడా చేర్చుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడింది.

టీడీపీపై దృష్టి పెట్టారా?
తెలంగాణలో పోటీకి దిగిన ప్రతిసారీ టీడీపీని ఆంధ్రుల పార్టీ అని, చంద్రబాబును ఆంధ్రావోడు అంటూ కేసీఆర్ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లడంతో బాబుకు ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటినుంచి టీడీపీలోనే ఉన్న కేసీఆర్‌కు ఇప్పటికీ ఏపీలో స్నేహితులున్నారు. తనతో సన్నిహితంగా ఉండేవారు.. సీటు దక్కని నేతలు, యాక్టివ్ గా లేనివారందరినీ బీఆర్ఎస్‌లో చేర్చుకొని రాజకీయం చేయడానికి సిద్దమయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు బీఆర్ఎస్‌పై స్పందించలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన్నుంచి చిరునవ్వే సమాధానమైంది. ఒకరకంగా చంద్రబాబు బీఆర్ఎస్ ను లైట్ గా తీసుకున్నారని అర్థమవుతోంది. రాజకీయంగా వ్యూహాలు రచించడంలో కేసీఆర్ ను మించినవారు లేరు. అతన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, తమ జాగ్రత్తలోతాముంటున్నామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఎవరి వ్యూహాలు పనిచేస్తాయో? ఎవరు ఎవర్ని బలహీనపరుస్తారో కాలమే నిర్ణయించనుంది.












Click it and Unblock the Notifications