బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు, శాస్తి జరుగుతుంది: బాబుకు ధీటుగా కెసిఆర్
నల్లగొండ: మహా సంకల్ప సభలో తనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. నీ అరుపులకు, పెడబొబ్బలకూ భయపడేది లేదని ఆయన అన్నారు. అలాగే అరిస్టే జరగాల్సిన శాస్తి జరుగుతుందని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన సోమవారం సాయంత్రం మాట్లాడారు.
"మేం పని లేకుండా ఉన్నామా, గోల్లు గిల్లుకుంట కూచుంటున్నామా, మా పని చేసుకునేందుకే సమయం సరిపోవడంలేద"ని ఆయన అన్నారు. చంద్రబాబును ఎవరు కేసులో ఇరికిస్తారని, ఎందుకు ఇరికిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. పట్టపగలు దొంగతనం చేసిన పట్టబడ్డాడని ఆయన అన్నారు. దొంగ పనులు చేసివాడిని దొంగ అనకపోతే ఏమంటారని ఆయన అడిగారు.

అయినా చంద్రబాబు ఇరికిస్తే ఇరికే వాడేనా అని, ఇతరులను ఇరికించేవాడని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన కొంపను తానే కూల్చుకున్నాడని ఆయన అన్నారు.చంద్రబాబు కొంపలు కాల్చే రకమేకానీ తన కొంప కాల్చుకునే వాడు కాదన్నారు. పక్క రాష్ట్రం నేతలు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలను కొని గెలిపించుకుంటామంటే చేతులు ముడుచుకు కూర్చోవాలా? అని మండిపడ్డారు.
హైదరాబాద్ మీద కేసీఆర్ కు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందని చంద్రబాబు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చంద్రబాబు జాగీరా, చంద్రబాబు తాత జాగీరా అని ఆయన అడిగారు. ఇవాళ తెలంగాణలో తెలంగాణ బిడ్డ సీఎంగా ఉన్నాడని తెలిపారు. ఖబర్దార్ చంద్రబాబు హైదరాబాద్ నీ అబ్బ జాగీర్ కాదని హెచ్చరించారు. నీ బతుకేందో, నీ లుచ్చతనం ప్రజలకు తెలిసిందన్నారు. ఇక తెలంగాణ ప్రజలే నీకు తగిన బుద్ది చెబుతారన్నారు.
తెలంగాణ గడ్డ మీద చంద్రబాబు కిరికిరి చెల్లదని ఆయన అన్నారు. చంద్రబాబుకు బలం లేకున్నా గెలిచే దమ్ము లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశాడని ప్రశ్నించారు. అంటే వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొని గెలవాలని పన్నాగం పన్నావా? అని నిలదీశారు. "నిన్ను పట్టించింది నీవు అవినీతికి ప్రోత్సహించిన స్టీఫెన్‌సన్" అని తెలిపారు. "నీ సంగతంతా ఫోన్ మాటల్లో బయటపడింద"న్నారు. "పట్టపగలు దొరికిన దొంగవు నీవు చంద్రబాబు, ఎక్కువ మాట్లాడితే నీకు ఏ శాస్తి జరగాలో అది జరుగుతుంది" అని కేసీఆర్ హెచ్చరించారు.
రాజకీయాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు. "నీ ఎమ్మెల్యే జైలులో ఉన్నాడు, నీ బతుకే బయటపడుతుంది" అని చంద్రబాబును ఉద్దేశించి కెసిఆర్ అన్నారు. "నీకు ఎసిబి ఉన్నా నీలా కెసిఆర్ దొంగ కాడు" అని అన్నారు. టీవీలల్ల చంద్రబాబు బండారం బయటపడింది, చూశారు కదా అని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు బాగోతం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలిసిపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications