మరో పొలిటికల్ మ్యారేజీ: వియ్యమందుకుంటున్న కొనకళ్ల, కేఈ
అమరావతి: ఏపీలో రాజకీయ నాయకలు కుటుంబాలు మధ్య జరుగుతున్న వివాహాలు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు ఇప్పటికే బంధువులైన సంగతి తెలిసిందే. మంత్రి గంటా కుమారునితో మరో మంత్రి నారాయణ కూతురు వివాహం ఖరారైపోయింది.
ఇటీవలే వీరి వివాహానికి సంబంధించిన సంగీత్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇప్పుడు అదేదారిలో మరో రెండు కుటుంబాలు కూడా వియ్యమందుకోబోతున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి, కొనకళ్ల నారాయణ వియ్యంకులు కాబోతున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేఈ కృష్ణమూర్తి ఏపీ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్న కొనకళ్ల నారాయణ తెలుగుదేశం పార్టీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

గౌడ సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గతేడాది వరకు ఏపీ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కేఈ కృష్ణమూర్తి పనిచేశారు. ఇటీవలే ఆ పదవికి కొనకళ్ల నారాయణ ఎన్నికయ్యారు. దీంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన తమ్ముడు జయచంద్రుడి కుమార్తె మహితను, కొనకళ్ల నారాయణ రెండవ కుమారుడు చైతన్యకు ఇస్తున్నారు.
నవంబరు 2వ తేదీన నిశ్చితార్థం, డిసెంబర్‌లో పెళ్లి జరపాలని రెండు కుటుంబాలూ నిర్ణయించుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయం చెప్పగా ఆయన కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications