అలిపిరి రివర్స్.. ప్రశ్నిస్తే చంపేస్తారా? బీజేపీకి పవన్-జగన్ సహకారమా?: కేఈ సంచలనం
అమరావతి: బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలపై టీడీపీ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీకి వైయస్సార్ కాంగ్రెస్, పవన్ కళ్యాణ్‌లు సహకరించడం దురదృష్టకరం అన్నారు.
Recommended Video

బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. అలిపిరి ఘటన రిపీట్ అవుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం టీడీపీ అడుగుతోందని, ఇచ్చిన హామీలు అమలు చేయమని మిమ్మల్ని ప్రశ్నిస్తే చంపుతారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోడీ అంటే మాస్టర్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఇండియా
కర్నాటక ఎన్నికల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ కొరత కనిపిస్తోందని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. నరేంద్ర మోడీ అంటే దేశంలో ప్రజలకు విరక్తి కలిగిందన్నారు. మోడీ అంటే మాస్టర్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఇండియా అని కొత్త అర్థం చెప్పారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

పవన్, జగన్‌లు సహకరించడం దురదృష్టకరం
బీజేపీకి జగన్, పవన్ కళ్యాణ్ సహకరించడం దురదృష్టకరం అన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని కేఈ కృష్ణమూర్తి అన్నారు. కేసుల నుంచి విముక్తి పొందేందుకే జగన్ ప్రధాని మోడీ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ కుట్రలో పవన్ కళ్యాణ్ ఓ పావు అన్నారు.

దమ్ములేని వైసీపీ
తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి బయటకు వస్తే వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు కేంద్రంపై తిరగబడితే వైసీపీ ఏం చేస్తోందని నిలదీశారు. వైసీపీ, బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీని నిలదీసే దమ్ములేని వైసీపీకి తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

జగన్, పవన్‌లు పిలిస్తే రాలేదు
బీజేపీతో కుమ్మక్కై ప్రజలను వంచిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే వంచన దినం అంటూ నిరసన వ్యక్తం చేయడం విడ్డూరమని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ, జనసేన పార్టీలు రెండుసార్లు అఖిల పక్ష సమావేశాలు పెడితే రాలేదన్నారు. కేంద్రం ఆడించినట్లుగా వారు ఆడుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications