సీనియర్లకు డేంజర్ బెల్స్ - సీన్ మార్చేసిన పోలింగ్..!!
ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ సరళి పలువురు ముఖ్య నేతల్లో టెన్షన్ పెంచుతోంది. గెలుపు తమదే నంటూ పైకి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి గమనించిన తరువాత ఎవరికి ఎక్కడ మెజార్టీ స్థానాలు వస్తాయనేది దాదాపు క్లారిటీ వచ్చింది. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో ఈ సారి పార్టీల కంచుకోటలు బీటలు వారే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ల సీట్లలోనూ సరళి మారినట్లు స్పష్టం అవుతోంది.
మారుతున్న లెక్కలు
2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఎంపీ స్థానంతో సహా తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ అదే రిపీట్ చేస్తామని వైసీపీ ముఖ్య నేతలు
ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, టీడీపీ లెక్కలు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో వైసీపీ గెలుపు బాధ్యతలను సీనియర్ మంత్రి బొత్సా తీసుకున్నారు. టీడీపీ సీనియరం నేత అశోక్ గజపతిరాజు ఇప్పుడు అనారోగ్య కారణాలతో అంత యాక్టివ్‌గా లేకపోవటం పార్టీకి మైనస్ గా మారింది. జిల్లాలో టీడీపీ ఈ సారి చీపురుపల్లి, గజపతినగరం, పార్వతీపురంలో అభ్యర్ధులను మార్చింది.

గెలుపు పై ధీమా
పోల్ మేనేజ్ మెంట్ లో రెండు పార్టీలు హోరా హోరీగా పని చేసాయి. రెండు పార్టీలు జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ పెరిగింది. 2019లో 80.67 శాతం పోలింగ్ శాతం నమోదవ్వగా ప్రస్తుతం 81.33 శాతం పోలైంది. దీంతో ఇరు పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమకే విజయావకాశాలు ఉన్నాయని కార్యకర్తలకు చెప్పుకొస్తున్నారు. తొమ్మిది నియోజకవర్గాల్లో గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓట్లు పెరగడం, పోలింగ్ శాతం కూడా పెరగడం చూసి కొందరు అభ్యర్థుల్లో ఆందోళన, మరికొందరు అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది.

మెజార్టీ సీట్లు దక్కేదెవరికి
మంత్రి బొత్స, జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను మాత్రం మరోసారి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, పెరిగిన ఓట్ల శాతం తమకు అనుకూలంగా మారిందని చెప్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన సరళి తమకు అనుకూలమని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ ముఖ్యులు విజయనగరం జిల్లాలో టీడీపీ అనూహ్య స్థాయిలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్ ల వారీగా పోలైన ఓట్లు...లెక్కల పైన కుస్తీ పడుతున్నారు. రెండు పార్టీలు పోలింగ్ తమకే అనుకూలంగా జరిగిందని చెబుతున్న సమయంలో జిల్లాలో ఎవరికి మెజార్టీ సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications