ఖమ్మం టెన్షన్: సిపిఎంతో వైయస్ జగన్ దోస్తీకి సిద్ధం?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రేపు బుధవారం వైయస్ జగన్ ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. జగన్ ఖమ్మం జిల్లా పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ జెఎసి నాయకులు ప్రకటించారు. జగన్ పర్యటన నేపథ్యంలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఖమ్మంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వారిని తెలంగాణవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా, తెలంగాణలో పాగా వేయడానికి జగన్ పకడ్బందీ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సిపిఎంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణలో తన ఉనికిని చాటుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సిపిఎం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సమైక్య నినాదాన్ని వినిపించింది. దీంతో ఇరు పార్టీల మధ్య భావసారూప్యత కారణంగా పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

సిపిఎం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్‌తో సంబంధాల కారణంగానే సిపిఎంతో సిపిఐ విభేదిస్తూ వస్తోంది. దీంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వేర్వేరు పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో, తెలంగాణలో తెరాసతో వెళ్లాలని సిపిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరు ప్రాంతాల్లో కూడా సిపిఎం జగన్ వెంటే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సిపిఎంను ఆలంబనగా చేసుకుని ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అస్తిత్వాన్ని చాటుకోవాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సిపిఎం బలంగానే ఉంది. సిపిఎం క్యాడర్‌కు వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు తోడైతే బలాన్ని ప్రదర్శించడానికి వీలవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే స్పష్టత లేదని, అయితే సిపిఎంతో ఉండవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర ్రావు అన్నారు. దీన్ని బట్టి ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications