నా ఇష్టం: శ్రీధర్‌బాబుపై కిరణ్, పార్టీపై నో, జగన్‌పై విసుర్లు
హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు అంశం రాజకీయ వేడిని రాజేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీనిపై బుధవారం స్పందించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే తాను శాఖలను మార్చానని వివరణ ఇచ్చుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో రెవెన్యూ తగ్గిందని, రెవెన్యూ పెంచేందుకే శ్రీధర్ బాబుకు ఆ శాఖను కేటాయించినట్లు చెప్పారు. శాఖల కేటాయింపులో ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమన్నారు.
తనపై వస్తున్న విమర్శలకు తాను ప్రతి విమర్శలు చేయనన్నారు. తానెప్పుడు పార్టీ విధానాల పైనే మాట్లాడానని తెలిపారు. జనవరి 23 వరకు అసెంబ్లీలో చర్చ జరగడం పైనే తన దృష్టి ఉందన్నారు. బంతి వేశాక ఎలా ఆడాలో నిర్ణయిస్తామన్నారు. ముందే సిక్స్ కొట్టాలో లేక ఫోర్ కొట్టాలో అనుకుంటే ఔటవుతామన్నారు. భవిష్యత్తు పైన తనకు ఎప్పుడు అంచనాలు లేవన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఇతర నేతలు మీడియా సమావేశాల్లో మాట్లాడినంత మాత్రాన సమైక్యవాదం వినిపించినట్లు కాదన్నారు. ఆ పార్టీ నేతలు సభలో సమైక్యం గురించి మాట్లాడాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడితే అది రికార్డ్ అవుతుందన్నారు.
తాను ఇంకా కొత్త పార్టీ పైన ఆలోచించలేదని చెప్పారు. విభజన పైన ఇరు ప్రాంతాల్లో భిన్నమైన అభిప్రాయాలున్నాయని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సజావుగా సాగితేనే ఏ ప్రాంతానికి లాభం, నష్టం జరిగిందో వివరించే అవకాశముంటుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తనకు ఎక్కువ లేఖలు తెలంగాణ ప్రాంతం నుండే వస్తున్నాయని చెప్పారు.
క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కిరణ్‌కు టిటిడి వేద పండితులు ఆశీస్సులు అందించారు.












Click it and Unblock the Notifications