సీమాంధ్రలో కిరణ్ కింగ్ మేకర్: 50 సీట్లు ఖాయమా?
హైదరాబాద్: ఓ వైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పైన జోరుగా ఊహాగానాలు వస్తుండగానే మరోవైపు అతను పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో ఒక్కరొక్కరిగా చర్చలు జరుపుతున్నారట. ఇప్పుటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సమైక్య ఫ్లెక్సీలు వెలిసి కలకలం రేపాయి. తాజాగా కిరణ్ పలువురు నేతలతో వ్యక్తిగతంగా చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
ముఖ్యంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారట. కొత్త పార్టీ పెట్టే ఉద్దేశ్యంలో భాగంగానే కిరణ్ వారితో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఈ నెల 23వ తేదీ తర్వాత లేదా రాష్ట్రపతి తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మరికొంత గడువు ఇస్తే ఆ తర్వాత కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సుదీర్ఘంగా మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారట. ఈ నెల 21వ ఆయన సభలో ప్రసంగించే అవకాశముంది. ఆయన సమైక్య రాష్ట్రంతో ఇరు ప్రాంతాలకు కలిగే ప్రయోజనాలను సభలో చెప్పనున్నారు. బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపించిన తర్వాత ఎప్పుడైనా కొత్త పార్టీపై ప్రకటన చేయవచ్చునని అనుమానిస్తున్నారు. అధిష్టానం కూడా కిరణ్ కదలికల పైన కన్ను వేసింది.
కిరణ్ కొత్త పార్టీపై సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం కిరణ్ కచ్చితంగా పార్టీ పెడతారని చెబుతున్నారు. కిరణ్ పార్టీ పెడితే సీమాంధ్రలో యాభై లేదా అంతకుమించి సీట్లు గెలువవచ్చునని అప్పుడే పలువురు లెక్కలు కూడా వేస్తున్నారట. అప్పుడు కిరణ్ కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కింగ్ మేకర్ అవుతారని అంటున్నారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనతోనే కిరణ్ పలువురు నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లకుండా ఆపుతున్నారంటున్నారు.
కిరణ్ సీమాంధ్రలో సొంత సర్వేలు చేయించుకున్నారట. సీమాంధ్రలో రాజకీయ శూన్యత ఉందని, ఇప్పుడు కొత్త పార్టీ పెడితే బాగుంటుందని ఆ సర్వేలో తేలిందట. సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పటి నుండి కిరణ్ బలంగా సమైక్యవాదం వినిపిస్తున్నారని, ఇది ప్రజల్లోకి వెళ్లిందని, ప్రజలు ఆయనను పూర్తిగా విశ్వసిస్తున్నారని ఆయన వర్గం అంటోంది.
మరోవైపు 2014 ఎన్నికలలోపే విభజన జరుగుతుందని చెబుతున్నారని, రాష్ట్రం విడిపోయాక జై సమైక్యాంధ్ర పార్టీ అని కొత్తగా వస్తే లాభమేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికల వరకు విభజన జరగకుంటే.. కిరణ్ కొత్త పార్టీ పెడితే అప్పుడు లబ్ధి చేకూరుతుందని, విభజన తర్వాత పెడితే ఉపయోగం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications