కిరణ్ రెడ్డి నోటీస్: తెలంగాణ బిల్లుపై కొత్త వివాదం
హైదరాబాద్: రాష్ట్రపతికి వెనక్కి పంపుతూ శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని కోరుతూ సభా నాయకుడిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చిన నోటీస్ కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని తెలంగాణ నాయకులు విమర్శిస్తున్నారు. బిల్లు చర్చకు అర్హమైంది కాదని ముఖ్యమంత్రి అన్నారు. 77వ నిబంధన కింద తీర్మానం చేసి బిల్లును వెనక్కి పంపించాలని సిఎం కోరారు.
బిల్లులో తప్పులుంటే చర్చించడానికి సిద్ధపడడం సరి కాదని, బీహార్ గతంలో బిల్లును వెనక్కి పంపిన ఉదంతం ఉందని చంద్రబాబు సభలో అన్నారు ఈ స్థితిలో ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు అప్రమత్తమయ్యారు. 77వ నిబంధన కింద తీర్మానం చేసి బిల్లును వెనక్కి పంపించాలని కోరుతూ వారు మరోసారి స్పీకర్‌ను నోటీసు ఇచ్చారు.

ముసాయిదా బిల్లుపై తీర్మానంపై సోమవారం ఓటింగ్ జరగవచ్చుననే ఉద్దేశంతో తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులున్నారు. దీంతో సోమవారం ఉదయం 8 గంటలకే సభకు రావాలని వారు తమ పార్టీ సభ్యులను కోరారు. ఇన్నాళ్లు తాము చెప్పిందే ముఖ్యమంత్రి చేశారని సీమాంధ్ర తెలుగదేశం సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి అన్నారు. బిల్లును వెనక్కి పంపించాలని తీర్మానం ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. స్పీకర్‌కు నోటీసు ఇవ్వడాన్ని బట్టి తమ పంథా సరైందనేది తేలిందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపించే తెలివితేటలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేవని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. బిల్లును వెనక్కి పంపించేలా సోమవారమే తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లును వెనక్కి పంపించే విషయంపై సీమాంధ్ర నేతలంతా ఒకే మాటపై నిలబడాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications