Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రభావం కనిపించింది.. కేకే సర్వే..
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఈ కూటమి 230 సీట్లు సాధించి రికార్డ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కూటమిలో బీజేపీ అత్యధికంగా 132 సీట్లు గెలుచుకోగా.. శివసేన 57 స్థానాలు, ఎన్సీపీ 41 చోట్ల గెలుపొందాయి. ఇక మహా వికాస్ అఘాడి కేవలం 46 సీట్లకే పరిమితం అయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి అట్టర్ ప్లాప్ షో చేసింది. ఆ కూటమిలో అత్యధికగా శివసేన యూబీటీ 20 చోట్ల, కాంగ్రెస్ 16 స్థానాలు, ఎన్సీపీ ఎస్పీ 10 చోట్ల విజయం సాధించాయి.
మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కేకే సర్వే విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫలితాలు వచ్చాయి. దీంతో మరోసారి కేకే సర్వే చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికలపై వన్ ఇండియా తెలుగు కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటితో ఎక్స్ క్లూజివ్ ఫేస్ టూ ఫేస్ నిర్విహించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఎలా విజయం సాధించిందో కిరణ్ వివరించారు. ముఖ్యంగా మరాఠ ఎన్నికల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం పై ఆయన మాట్లాడారు.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. బల్లార్‌పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్‌పూర్, కస్బాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన మెజారిటీ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభావం ఉందని కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి చెప్పారు. ముఖ్యంగా తెలుగు వారు ఉన్నచోట ఎక్కువగా పవన్ ఎక్కువగా ప్రభావం చూపారని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ప్రచారం వల్ల బీజేపీకి ఒకటి, రెండు శాతం ఓటింగ్ పెరిగి ఉండొచ్చని అంచనా వేశారు. బీజేపీకి ఇన్నాళ్లకు బలమైన, ప్రజా ఆకర్షణ ఉన్న పవన్ కల్యాణ్ దొరికాడని తెలిపారు. భవిష్యత్ లో బీజేపీకి పవన్ కల్యాణ్ బలమైన మిత్రుడిగా ఎదిగే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా కేకే సర్వే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సరైన అంచనాను విడుదల చేసింది. 175 స్థానాల్లో టీడీపీ కూటమికి 161, వైసీపీ 14 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఆ ప్రకారమే ఫలితాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications