మళ్లీ యాక్టివ్ అయిన కొడాలి నాని, రాధాతో భేటీ - మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి పార్టీలు మాజీ సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు జగన్ సైతం కూటమి ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించారు. ఇప్పటి వరకు కేసులు ఎదుర్కొన్న వైసీపీ నేతలు తిరిగి తన నియోజకవర్గాల్లో రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. తాజాగా జగన్ తో భేటీ తరువాత తిరిగి కొత్త కార్యాచరణ ప్రారంభించారు. వంగవీటి రాధాతో సమావేశం ఆసక్తి కరంగా మారింది.
మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి రాజకీయంగా క్రియాశీలకంగా మారుతున్నారు. గుండె ఆపరేషన్ కారణంగా కొద్ది నెలలు నాని విశ్రాంతిలో ఉన్నారు. ప్రస్తుతం తిరిగి కోలుకున్నారు. కేసులను కోర్టు లో ఎదుర్కొంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్ తో కొడాలి నాని తన సహచరుడు వల్లభనేని వంశీతో కలిసి భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. నాని - వంశీకి కొత్త బాధ్యత లు అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు.

జగన్ లండన్ పర్యటన తరువాత వీరిద్దరికీ కొత్త బాధ్యతల పైన జగన్ నిర్ణయం వెల్లడించనున్నారు. ఇదే సమయంలో ఈ ఇద్దరు నేతలు వంగవీటి రాధా నివాసంలో జరిగిన ఒక ఫంక్షన్ కు హాజరయ్యారు. రాధాతో ఈ ఇద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2024 ఎన్నికల ఫలితాల తరువాత వీరంతా ఒకే వేదిక మీదకు రావటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.
అటు వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నప్పటికీ.. క్రియాశీలకంగా లేరు. 2019 ఎన్నికల ముందే రాధాకు టీడీపీ చేరే సమయంలో ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. ఆ సమయంలో రాధా రాజకీయంగా మౌనంగానే ఉన్నారు. కాగా.. 2024 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసారు.
పవన్ తో నూ సమావేశం అయ్యారు. అయితే.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని అంచనా వేసారు. ఇప్పటి వరకు రాధాకు పదవి దక్కలేదు. కాగా, రాధా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నికల ముందే రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కొడాలి నాని - వంశీ ప్రయత్నించారు. ఆ సమయంలో రాధా అంగీకరించలేదు.
అయితే, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వంగవీటి రాధా నివాసంలో జరిగిన కార్యక్రమంలో హాజరయ్యేందుకే నాని- వంశీ వచ్చారని చెబుతున్నారు. అయితే, రాజకీయంగా మాత్రం రానున్న రోజుల్లో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి కర చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications