గుడివాడ నుంచి వంగవీటి రాధా పోటీ - కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!!
కాపు సామాజిక వర్గాన్ని విమర్శించినట్లు వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తన రెండు దశాబ్దాల రాజకీయ గెలుపులో కాపు సోదరులు సగభాగమని చెప్పుకొచ్చారు. టీడీపీ మహానాడు నిర్వహణ పైన తాను చేసిన వ్యాఖ్యల్లో ఐటీడీపీ కట్ ..పేస్టులు వీడియోలు విడుదల చేసారని వివరించారు. దీని పైన జనసేన స్పందించదన్నారు. ఇదే సమయంలో గుడివాడ నుంచి వంగవీటి రాధా పోటీ గురించి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు.
వ్యాఖ్యల వివాదంపై క్లారిటీ:టీడీపీ నిర్వహించిన మహానాడులో ఎన్టీఆర్ ఫొటో కింద చంద్రబాబు..లోకేష్ ఫొటోలు పెట్టి బాలయ్య ఫొటో పెట్టకపోవటం పైన కొడాలి నాని ప్రశ్నించారు. ఆ సమయంలో టీడీపీలోని స్క్రాపు గాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించేలా కాపు అర్దం వచ్చేలా వీడియోలు విడుదల చేసారని కొడాలి నాని వివరించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని తన వ్యాఖ్యల పైన జరుగుతున్న ప్రచారానికి స్పష్టత ఇచ్చారు. రాజకీయాల్లో చచ్చినా సరే కాపు సామాజిక వర్గాన్ని తాను విమర్శించనని స్పష్టం చేసారు. మహానాడులో ఫొటోల పైనే తాను స్పందించా నని..అసలు కాపు ప్రస్తావనే రాలేదన్నారు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కాపు సోదరులు నమ్మలేదని వివరించారు.

రాధా పోటీ చేయరు:తన జీవితంలో ఇప్పటివరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదని కొడాలి నాని చెప్పారు. వంగవీటి రాధాపై కూడా నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు తమ్ముడిలాంటి వాడని, రాధా ఎట్టిపరిస్థితుల్లోనూ గుడివాడ నుంచి పోటీ చేయరని చెప్పుకొచ్చారు. టీడీపీ వాళ్లు చేసిన కట్ పేస్ట్ వీడియోను చూసి జనసైనికులు స్పందించడం హాస్యాస్పదంగా ఉందని నాని పేర్కొన్నారు. టిడిపి మాయలో పడవద్దని సూచించారు. జగన్ అందరికోసం పనిచేస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని నాని స్పష్టం చేశారు. దేశంలో శక్తివంతమైన నేత సోనియాగాంధీనే ఎదిరించి నిలబడిన నేత జగన్ అని, రాష్ట్రనాయకులను ఎదిరించి నిలబడలేడా అని ప్రశ్నించారు.
తేల్చేసిన కొడాలి నాని:పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యేందుకు, చంద్రబాబు ప్రతిపక్ష హోదాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ ఉన్నట్టైతే రాష్ట్రం విడిపోయేది కాదని, వైఎస్సార్ లేకపోవడం వలనే రాష్ట్రం విడిపోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నాని పేర్కొన్నారు. గతంలో గుడివాడలో కొడాలి నాని..వంగవీటి రాధా పలు సందర్భాల్లో కలుసుకున్నారు. ఆ సమయంలోనే గుడివాడ నుంచి వంగవీటి రాధా పోటీకి సిద్దమవుతున్నారనే ప్రచారం జరిగింది. కొడాలి నాని పైన టీడీపీ నుంచి గుడివాడలో ఎవరు పోటీకి దిగుతారనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ సమయంలో వంగవీటి రాధా గురించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications