జూ ఎన్టీఆర్ - నేను కలిసి ఆ నిర్ణయం, ఆ ఖర్చు మా ఇద్దరిదే : కొడాలి నాని..!!
మాజీ మంత్రి కొడాలి నాని కీలక అంశాలను వెల్లడించారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ..తాను కలిసి తీసుకున్న నిర్ణయాలు..అమలు చేసిన విషయాలను బయట పెట్టారు. గుడివాడలో చంద్రబాబు పర్యటన.. సభ పైన నాని స్పందించారు. చంద్రబాబు సభలో జనం లేరని ఎద్దేవా చేసారు. చంద్రబాబు దయ వలన తాను గెలవలేదని, 2004,2009 లో చంద్రబాబు తన కోసం ప్రచారం చేయని కారణంగా తన గెలుపు సాధ్యం అయిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గుడివాడకు చేసిందది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. నిమ్మకూరుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు.
తారక్ తో కలిసి రూ కోటి ఖర్చు చేసి: నిమ్మకూరులో ఇప్పుడు చంద్రబాబు రావటం..నిద్ర చేయటం పైన కొడాలి నాని స్పందించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ - బసవ తారకం విగ్రహాల ఏర్పాటుకు చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. తాను, జూ ఎన్టీఆర్ కలిసి రూ 60 లక్షలు ఖర్చు చేసి ఎన్టీఆర్ స్వగ్రామం కావటంతో అక్కడ ఆ ఇద్దరి విగ్రహాలు ఏర్పాటు చేసామని వివరించారు.
జూ ఎన్టీఆర్ రూ 40 లక్షలు, తాను రూ 20 లక్షలు ఖర్చు చేసినట్లు కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఆ తరువాత లక్షలాది మంది అక్కడకు వచ్చేలా భారీ ఈవెంట్ నిర్వహించామని మొత్తంగా కోటి రూపాయాల వరకు ఖర్చు చేసామని చెప్పారు. నిమ్మకూరు గ్రామానికి నాడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నందమూరి హరిక్రిష్ణ రూ 12 కోట్లు కేటాయించారని కొడాలి నాని వివరించారు. అసలు ఎన్టీఆర్ కోసం చంద్రబాబు చేసింది ఏదీ లేదని పేర్కొన్నారు.

కమ్మసంఘం మీటింగ్ కు వచ్చారా: 42 ఏళ్ల తరువాత నిమ్మకూరులో అత్తవారి ఇంటికి వెళ్తూ డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు సభ గుడివాడలో ఫ్లాప్ అయిందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు 3 కిలో మీటర్ల ప్రయాణించటానికి 5 గంటల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. ర్యాలీలో ముందు వైపు చంద్రబాబు, రావి వేంకటేశ్వర రావు, రాము, ఎన్టీఆర్ తనయుడు నలుగురు ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారని చెప్పుకొచ్చారు.
గుడివాడ అంటే అన్ని సామాజిక వర్గాలు, అందరూ కలిసి ఉండే ప్రాంతమని వివరించారు. ఈ నలుగురు రావాటానికి ఇదేమైనా కమ్మ సంఘ సమావేశమా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఏమయ్యారని కొడాలి నాని నిలదీసారు. ఒక్క వర్గం నేతలు మినహా మిగిలిన వారంతా అవసరం లేదా అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు సవాల్: చంద్రబాబు తన పైన చేసిన వ్యాఖ్యలను నాని ఖండించారు. కొడాలి నాని చంద్రబాబుకు సవాల్ చేసారు. గుడివాడలో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని చెప్పారు. గతంలో చంద్రబాబు ప్రచారం చేయకపోవటంతో తాను గెలిచానని, చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతీ సారి టీడీపీ అభ్యర్దులు ఓడిపోయారని పేర్కొన్నారు.
గుడివాడలో 23 వేల మంది ఇంటి స్థలాలు ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడివాడ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. 2024 ఎన్నికల ముందు ఇప్పుడు చంద్రబాబు గుడివాడ వచ్చారని..ఇక ధీమాగా ఉండవచ్చని పేర్కొన్నారు. జగన్ ఆస్తులు..చంద్రబాబు ఆస్తుల గురించి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ సింగిల్ గానే సింహంలా ఎన్నికల బరిలో దిగి టీడీపీ అడ్రస్ లేకుండా చేస్తారని కొడాలి నాని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications