శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, అన్ని ఏర్పాట్లు పూర్తి, తిరుమలలో బ్రేక్ దర్శనానికి బ్రేక్, గోవిందా !
ఆంధ్రుల నూతన సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు అయిన ఉగాదికి తిరుమలలోకి శ్రీవారి ఆలయం ముస్తాబు అవుతోంది, ఆంధ్రుల కొత్త సంవత్సరం రోజు శ్రీవారిని దర్శించుకోవడానికి సిద్దం అవుతున్నారు.
తిరుమల/తిరుపతి: ఆంధ్రుల నూతన సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు అయిన ఉగాదికి తిరుమలలోకి శ్రీవారి ఆలయం ముస్తాబు అవుతోంది, ఆంధ్రుల కొత్త సంవత్సరం రోజు శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాధం తీసుకోవడానికి శ్రీవారి భక్తులు సిద్దం అయ్యారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 22న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవీ. ధర్మారెడ్డితో పాటు అధికారులు, టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ఏడాదికి నాలుగుసార్లు
ఈసందర్భంగా శ్రీవారి ఆలయం వెలుపల టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు అంటే ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ఆళ్వార్‌తిరుమంజనంనిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు,శ్రీవారిఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని టీటీడీ ఈవో ధర్మరెడ్డి మీడియాకు చెప్పారు.

శ్రీవారి విగ్రహం.... పూర్వికులు ఇచ్చిన వరం
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారని, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. ఈ పరిమళాన్ని మన పూర్వీకులు ఎంతో కృషి చేసి మనకు వరంగా అందించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. పరిమళం ప్రోక్షణం ద్వారా క్రిమికీటకాలు రాకుండా ఆలయం పరిశుభ్రంగా ఉంటుందని, గోడలు పటిష్టంగా ఉంటాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

శ్రీవారికి ప్రత్యేక పూజలు.... బ్రేక్ దర్శనాలు రద్దు
స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కోయిల్‌ఆళ్వార్‌తిరుమంజనం, బుధవారం ఉగాది ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమలలో ఉగాది ఆస్థానం
శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్బంగా మార్చి 22వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications