TTD: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - ఆ సేవ రద్దు..!!
Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

వరుస నిర్ణయాలు
టీటీడీ నూతన ఈవో శ్యామలరావు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా భక్తుల సౌకర్యాల పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అన్నప్రసాదాల నాణ్యత పైన సూచనలు అందిస్తున్నారు. ఇక, తాజాగా తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈవో జిల్లా ఎస్పీని కోరారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేకమంది దళారులను ఉపేక్షించవద్దని..వారిపై వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భక్తుల భద్రత కోసం
అదే విధంగా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైల్ వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటి కప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications