విషాదం: తేలు కాటుతో పాఠశాల విద్యార్థి మృతి
కాకినాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తేలు కుట్టి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోరుమిల్లి గ్రామానికి చెందిన వై ప్రసాద్-శ్రీదేవి దంపతుల చిన్నా కుమారుడు అభిలాష్(14).. వాకతిప్ప జడ్పీహెచ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
అయితే, గురువారం తరగతి గదిలో చిక్కిల రేపర్లు ఎక్కువగా ఉండటంతో మరో విద్యార్థితో కలిసి శుభ్రం చేస్తుండగా.. అభిలాష్ ఎడమ చేతి వేలును తేలు కుట్టింది. విషయం తెలుసుకున్న జడ్పీహెచ్ ఉపాధ్యాయులు అభిలాష్‌ని వెంటనే స్థానిక పీహెచ్‌సీ తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు.

ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఊపిరితిత్తుల్లోకి విషం చేరడంతో.. అభిలాష్ రక్తపు వాంతులు చేసుకుని మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
బాలుడి మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై జి చంటి తెలిపారు. తండ్రి ప్రసాద్ వలస కూలీగా వరంగల్‌లో పనిచేస్తున్నాడు. తల్లి ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటోంది. అభిలాష్ తన తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు.
విద్యుత్ షాక్‌తో విద్యార్థి దుర్మరణం : విద్యుత్ షాక్ తగిలిని విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అరగంటపాటు ఉపాధ్యాయుడు కాలయాపన చేయడంతో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో తాత్కాలికంగా పూరింట్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
ఎస్సీకాలనీకి చెందిన లంక రవి, నవ్య కుమారి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్(8) రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం భోజనం తర్వాత ప్లేటు కడుక్కుందామని బోరుపాయింట్ వద్దకు వెళ్లగా.. నీరు రాకపోవడంతో ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మోటార్ స్విచ్ ఆన్ చేశాడు. వర్షాలకు తడిగా ఉన్న బోర్ పాయింట్ ద్వారా విద్యుత్ ప్రవహించడంతో.. దాన్ని ముట్టుకోగానే విద్యార్థికి షాక్ కొట్టి కింద పడిపోయాడు.
బాలుడిని ఆస్పత్రికి తరలించకుండా ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి తీసుకెళ్లి.. అరగంటపాటు సపర్యలు చేస్తూ స్పృహలోకి వస్తాడని ఎదురుచూశారు. ఈలోగా గ్రామస్థులు, తల్లిదండ్రులు వచ్చి బాలుడ్ని గుడ్లవల్లేరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధితులు బాలుడి మృతదేహాన్ని పాఠశాలకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. పరిహారం ఇవ్వడంతోపాటు సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.












Click it and Unblock the Notifications