గోదావరి జిల్లాలో పవన్ కు జనసేన నేత షాక్..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. గోదావరిలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన , బీజేపీ పొత్తులో ఇక్కడ సీట్ల సర్దుబాటు పైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది. ఇప్పటికే జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో అధికారికంగా ఆరు నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించారు. ఇదే సమయంలో సీట్లు రాని కొందరు స్వతంత్ర అభ్యర్దులుగా బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు జనసేన కీలక నేత అదే బాట పడుతున్నారు.
సీట్లు - అభ్యర్దులు
జనసేన అధినేత పవన్ ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేసే 6 మంది అభ్యర్దులను ప్రకటించారు. మరో నలుగురి స్థానాల పైన స్పష్టత ఇచ్చారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసారు. ఇదే సమయంలో మిగిలిన సీట్ల పైన బీజేపీ సీట్ల సంఖ్య పైన క్లారిటీ ఇచ్చిన తరువాత ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్నారు.

పిఠాపురం లో పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించిన తరువాత టీడీపీ ఇంఛార్జ్ వర్మ మద్దతు దారులు నిరసనకు దిగారు. వర్మను పిలిపించిన చంద్రబాబు బుజ్జగించారు. ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. దీంతో..వర్మ వచ్చే ఎన్నికల్లో పవన్ కు మద్దతిచ్చేందుకు అంగీకరించారు. ఇదే సమయంలొ మరో నియోజకవర్గంలో సమస్య మొదలైంది.
కొత్తపల్లి ఏం చేయబోతున్నారు
కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు. 1989, 94, 99, 2004లో టీడీపీ నుంచి, 2012లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి మంత్రిగానూ పనిచేశారు. అయితే 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు చేతిలో ఓడిపోయారు. 2014లో సుబ్బారాయుడు తిరిగి టీడీపీలో చేరారు.
కాపు కార్పోరేషన్ చైర్మన్ గా పని చేసారు. ఆ తరువాత 2019లో వైసీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా పార్టీ వీడారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన సమయం నుంచి ఉన్న సంబంధాలతో ఇప్పుడు తిరిగి జనసేనలో చేరటం ద్వారా నర్సాపురం నుంచి పోటీ చేయాలని భావించారు.

బరిలో నిలుస్తారా
తాజాగా అభ్యర్దుల ఖరారులో భాగంగా జనసేనాని నర్సాపురం అసెంబ్లీ సీటును బొమ్మిడి నాయకర్ కు కేటాయించారు. గతంలోనూ ఆయన పోటీ చేసి ఓడిపోయారు. దీంతో, ఈ సారి కూటమి అభ్యర్దిగా నాయకర్ ను బరిలోకి దింపుతున్నారు. తనకు సీటు రాదని తేలటంతో కొత్తపల్లి సుబ్బారాయుడు స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
దీంతో..జనసేన నేతలు కొత్తపల్లిలో మంతనాలు ప్రారంభించారు. స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తే కూటమికి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే సుముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో..ఇప్పుడు కీలకమైన నర్సాపురం లో సుబ్బారాయుడు స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తారా...ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications