హైద్రాబాదేకాదు, ఏపీకూడా, బాబు ఆసక్తి: ఐటీపై కేటీఆర్
హైదరాబాద్: ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. వరంగల్, కరీంనగర్ లాంటి చోట్ల పెట్టుబడులు పెట్టి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సాప్ట్‌వేర్ పరిశ్రమలు, సేవల సంస్థ సభ్యుల కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఐటి విస్తరణకు గల అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
హైదరాబాద్‌లో ఐటి రంగానికి ఉన్న అవకాశాలను వివరించడంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను నాస్కామ్ కార్యవర్గ సభ్యులకు వివరించారు. ముఖ్యమంత్రి సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాల్లో వేగం, అవినీతి రహిత పాలన ఉన్న తెలంగాణలో ఉన్నందున పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరారు.

ఐటి పాలసీని నిర్ణయించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరలో ఐటి కంపెనీల వారితో ఒక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే తెలగాణ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుతో పలు అంతర్జాతీయ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్నారన్నారు.
ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఆశావహంగా ముందుకు పోతోందన్నారు. దీనిని మరింత పైకి తీసుకు వెళ్లేందుకు అనువుగా భద్రత నుండి మెరుగైన మౌలిక సదుపాయాల వరకు అన్నింటినీ సమకూర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఐటి కంపెనీల సమస్యలను అడిగి తెలుసకుకున్నారు. వాటన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఐటి పరిశ్రమను హైదరాబాదుకే కాకుండా వరంగల్, కరీంనగర్‌లకు విస్తరించి, ప్రోత్సహిస్తామన్నారు. సాఫ్టువేర్ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాఫ్టువేర్ పరిశ్రమ అభివృద్ధికి చాలా ఆసక్తితో ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications