భూమా విషయంలో చంద్రబాబు ఆ మాట ఎప్పుడూ చెప్పలేదు: టీడీపీ
భూమాకు మంత్రి పదవి ఇస్తామని తమ అధినేత చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని కూన రవికుమార్ చెప్పారు.
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. 'సభలోకి వస్తే.. భూమా మంచితో పాటు చెడు కూడా మాట్లాడాల్సి వస్తుంది'అంటూ వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించడంతో టీడీపీ నాయకులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. సాటి శాసనసభ్యుడు చనిపోయినప్పుడు సంతాప సభకు కూడా జగన్ హాజరుకాకపోవడం దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. కనీస మర్యాదలను కూడా జగన్ పాటించలేదని రవికుమార్ మండిపడ్డారు. రాజకీయంగా ఒకప్పుడు జగన్ కు అండగా నిలబడ్డ వ్యక్తికి ఆయన ఇచ్చే గౌరవమిదేనా? అని ప్రశ్నించారు.

ఇక భూమాకు మంత్రిపదవి ఆశచూపి ఇవ్వకపోవడం వల్లే తీవ్ర మనస్థాపానికి లోనై ఆయన హఠాన్మరణం చెందారని ప్రతిపక్షం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలను అధికార పక్షం తిప్పికొడుతోంది. భూమాకు మంత్రిపదవి ఇస్తామని తమ అధినేత చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని కూన రవికుమార్ స్పష్టం చేశారు.
వ్యక్తిగతంగా చంద్రబాబును వైఎస్ విమర్శించినప్పటికీ.. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారని ఈ సందర్బంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications