చంద్రబాబు కంచుకోట బద్దలయ్యేనా- కుప్పం ఫలితంపై ఉత్కంఠ : పెద్దిరెడ్డికి ప్రతిష్ఠాత్మకం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో ఎలాగైనా జెండా ఎగరేయాలని వైసీపీ గట్టి ప్రయత్నాలే చేసింది. అదే సమయంలో తన ఇలాకాలో పట్టు నిరూపించుకోవటం చంద్రబాబుకు సవాల్ గా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై చంద్రబాబుకి సవాల్ చేసింది. మళ్లీ ఇప్పుడు మరో ఎన్నికల ఫలితం రాబోతోంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లోనైనా సైకిల్ సత్తా చాటుతుందా.. లేక మళ్లీ ఫ్యాన్ హవానే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతోంది.

చంద్రబాబు కంచుకోటలో కీలక పోరు
టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటైన కుప్పంలో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని నిర్ణయించి..దానికి అనుగుణంగా పావులు కదలిపింది. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా..అందులో ఒకటి ఏకగ్రీవం అయింది. మిగిలిన 24 వార్దులను ఎన్నికలు జరిగాయి. ఇక, ఈ రోజున జరిగే కౌంటింగ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే కుప్పంలో భారీగా దొంగ ఓటర్లు ఉన్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళనతో దిగడంతో కుప్పం రణరంగాన్ని తలపించింది.

ఎవరి లెక్కల్లో వారు.. ఇద్దరికీ కీలకమే
కుప్పంలో 76.84 శాతం పోలింగ్ నమోదైంది. తొలి సారిగా కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది కాసేపట్లో తేలనుంది. పార్టీపరంగా టీడీపీకి, వ్యక్తిగతంగా చంద్రబాబుకు కంచుకోట వంటి ఈ మున్సిపాలిటీలో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ విజయావకాశాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎవరికి వారు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో క్లీన్ స్వీప్ చేస్తామని తొలి నుంచి వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు.

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో వైసీపీని గెలిపించి చంద్రబాబుకు బలం లేదని నిరూపిస్తామంటూ ప్రకటించారు. అక్కడే మకాం వేసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ఎన్నిక టీడీపీ వర్సెస్ వైసీపీ కంటే..చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లుగా ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రచారం ముగిసే ముందు రెండు రోజులు లోకేశ్ కుప్పంలో ప్రచారం చేసారు. సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. కుప్పంలో జరుగుతున్న పరిణామాల పైన చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీసారు. ఎన్నికల సంఘానికి..డీజీపీకి ఫిర్యాదులు చేసారు.

మధ్నాహ్నం తుది ఫలితం
కుప్పంలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించాలని కోర్టుకు వెళ్లారు. పోలింగ్ రోజున చంద్రబాబు సీరియస్ అయ్యారదు. అసలు ఎన్నికల సంఘం ఉందా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కంచుకోట బద్దలు కొడుతున్నామంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ధీమా వ్యక్తం చేసారు. చివరకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పోలింగ్ రోజున వచ్చిన ఆరోపణల పైన స్పందించారు. చిన్న చిన్న ఘటనలు మినహా .. ఎక్కడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు.
Recommended Video

గెలిచేదెవరు.. కుప్పం రాజకీయ భవిష్యత్ పై ప్రభావం
రీ పోలింగ్ కోసం ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ లో విజేతలు ఎవరనే దాని పైన జోరగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. దీంతో.. కుప్పం ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మిగితా మున్సిపాలిటీల కంటే కుప్పం ఫలితాలపైనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల్లో ఉత్కంఠ నెలకొంది. మరి కొన్ని గంటల్లో కుప్పంపై కూర్చునేదెవరో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications