కర్నూలు ప్రమాదం బస్సు యజమాని అరెస్టు..! గంటల్లోనే విడుదల..!
ఏపీలో గత నెలలో చోటు చేసుకున్న కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున రోడ్డుపై ప్రమాదానికి గురై పడి ఉన్న బైక్ ను చూసుకోకుండా అలాగే బస్సును పోనిచ్చిన డ్రైవర్ ఈ దారుణానికి ప్రధాన కారకుడిగా నిలిచాడు. అతన్ని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే తాజాగా ఈ బస్సు ట్రావెల్స్ సంస్థ వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే అతను గంటల వ్యవధిలోనే విడుదలయ్యాడు.
వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారకుడు డ్రైవర్ లక్ష్మయ్యే అయినా ఈ బస్సు నడుపుతున్న ట్రావెల్స్ సంస్థ యజమాని వినోద్ కూ బాధ్యత ఉంది. ఇదే కారణంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆయనపైనా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో ఆయన ఏ2గా ఉన్నారు. అయితే కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయన తనను విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

దీనిపై విచారణ జరిపిన స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు.. ఆయన్ను 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వేమూరి వినోద్ కుమార్ విడుదల కూడా అయ్యారు. ఇంత తీవ్రమైన కేసులో ఏ2గా ఉన్న వ్యక్తికి ఇంత సులువుగా వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇదే కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్య మాత్రం అరెస్టు తర్వాత రిమాండ్ పై ఉన్నారు. కానీ ఏ2 మాత్రం విడుదలై ఇంటికి వెళ్లిపోవడం విశేషం.
కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలోనూ తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు తెల్లవారు జామున మంటల్లో కాలి బూడిద కావడంతో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కేసును సీరియస్ గా తీసుకుని చర్యలకు ఆదేశించాయి. అలాగే లోతుగా దర్యాప్తు చేసేందుకు టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశాయి. మరి ఏమైందో ఏమో కానీ ఈ బస్సు యజమాని మాత్రం ఇలా వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల కావడం చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications