హోదాపై బీజేపీ, టీడీపీ లాలూచీ: చంద్రబాబు ప్రస్తావన తెచ్చి కేవీపీ మండిపాటు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బీజేపీ దర్శకత్వంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో శుక్రవారం స్వల్పకాలిక చర్చకు వచ్చింది.

ఈ చర్చలో భాగంగా ఏపీ పునర్ వ్వవస్థీకరణ చట్టం, హమీల అమలుపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలను సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు.

జైట్లీ సమాధానంపై రాజ్యసభలోని కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి చెందారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం కేవీపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో టీడీపీ, బీజేపీ లాలూచీ కుస్తీ పడుతున్నాయని అన్నారు.

kvp ramachandra rao fires over arun jaitley answer in rajya sabha

ఏపీకి ప్రత్యేకహోదాపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా టీడీపీ అధినేత, ఏపీ చంద్రబాబును పొడిగేందుకు సమయం వృధా చేశారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ, టీడీపీ తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు బయట ఒకమాట, సభలో మరో మాట చెప్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఆగస్టు 5న మళ్లీ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు రానుందని, ఆరోజు ప్రభుత్వం తీరుని బట్టి కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తోందని వెల్లడించారు.

చెప్పినవే చెప్పారు తప్ప ఏపీకి ఏ విధమైన మేలు చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన చట్టాలను సైతం చేయబోతున్నామని హామీ కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

'హోదా'పై స్పష్టత లేదు: రఘువీరారెడ్డి

ఏపీకి ప్రత్యేకహోదాపై క్లారిటీ ఇవ్వని కేంద్ర ఆర్థిక మంత్రి అరున్‌జైట్లీ సమాధానం ప‌ట్ల ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేవర‌కు త‌మ పోరాటం ఆగ‌బోద‌ని ఆయ‌న చెప్పారు.

కేంద్రం మ‌రోసారి త‌న ద్రోహ‌పూరిత వైఖ‌రిని రాజ్య‌స‌భ‌లో బ‌య‌ట‌పెట్టింద‌ని ఆయ‌న ధ్వజమెత్తారు. కేంద్రం తీరుకి నిర‌స‌న‌గా, ప్ర‌త్యేక హోదా సాధించుకోవ‌డం కోసం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించి తీరుతామ‌ని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
kvp ramachandra rao fires over arun jaitley answer in rajya sabha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి