లక్షల మంది పవన్ కళ్యాణ్‌లున్నారు: మోడీ
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రల్లో లక్షల మంది పవన్ కళ్యాణ్‌లున్నారని, వారి మీదనే తెలంగాణ, సీమాంధ్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. తెలుగుజాతి స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ ప్రదర్శించారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతో ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాదు బహిరంగసభ వేదికను పంచుకున్నారు. దేశ ముఖచిత్రం మారాలని, జీవితాలు మారాలని, కలలు సాకారం కావాలని ఆయన అన్నారు. దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ సమస్యలను పరిష్కరించడానికి సుపరిపాలన అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
రాజకీయ విశ్లేషకుల అంచనాలు తప్పు అవుతాయని, వారు ఎసి రూంల్లో కూర్చుని లెక్కలు వేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలవుతాయని ఆయన అన్నారు. రాజకీయం గణిత శాస్త్రం కాదని, రసాయన శాస్త్రమని ఆయన అన్నారు. మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ వేదిక మీద ఉన్నారని, ముగ్గురి కెమిస్ట్రీ కలిసిందని, వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ మూడు కావని, 111 అవుతాయని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోరాటం చేయడం లేదని, దేశ ప్రజలు పోరాటం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్డీయే సునామీ కనిపిస్తోందని ఆయన అన్నారు. తాను దేశంలో ప్రతి మూలకు వెళ్లానని ఆయన చెప్పారు. కాంగ్రెసు, దాని మిత్ర పక్షాలు కొట్టుకుపోతాయని ఆయన అన్నారు. హైదరాబాద్ నేల మీద ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని ఆయన చెప్పారు. తెలుగు ప్రజలంటే కాంగ్రెసుకు కక్ష అని ఆయన అన్నారు. పివి నర్సింహారావు పేరు మీద ఒక్క పథకం కూడా లేదని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ బిడ్డకు జన్మనిచ్చింది గానీ తల్లిని చంపేసిందని ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశించి అన్నారు. తెలంగాణ స్ఫూర్తి అనే తల్లిని కాంగ్రెసు చంపేసిందని ఆయన అన్నారు. సిబిఐని రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నారని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో ఓ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్యను అవమానించారని, అంజయ్య కళ్ల వెంట కన్నీరు ఉబికి వచ్చిందని ఆయన అన్నారు. సంజీవరెడ్డి రాష్ట్రపతి కాకుండా ఇందిరా గాంధీ కుట్ర చేసి, వివి గిరిని రాష్ట్రపతి చేశారని ఆయన అన్నారు.
అంజయ్య అవమానానికి గురైన తర్వాత కాంగ్రెసు 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కనిపించకుండా పోయిందని ఆయన అన్నారు. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ భారతదేశానికి చెంది ఉండేది కాదని ఆయన అన్నారు. విభజన విధానంపై తాను కలత చెందానని ఆయన అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మూడు రాష్ట్రాలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పడ్డాయని, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో రక్తం కళ్ల చూసిందని ఆయన అన్నారు.
తెలంగాణ ఇవ్వకూడదని కాంగ్రెసు అనుకుందని, అందులో భాగంగానే ఆ పార్టీ ఎంపి పెప్పర్ స్ప్రే చల్లారని ఆయన అన్నారు. యువత కలలను సాకారం చేసే ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. చదువు పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి కావాలంటే సమర్థమైన ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. ఈ దేశం ఎటు పోతే అటు పోతుందని వదిలేద్దామా అని ఆయన అడిగారు. బయటకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు మరోసారి మోసపూరిత ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు అబద్ధాల మానిఫెస్టోపై మీకు నమ్మకం ఉందా అని మోడీ అడిగారు. విద్యార్థుల జీవితాల్లో ఇంటర్మీడియట్ విద్య పునాది అని, ఇంజినీర్ - డాక్టర్ - కలెక్టర్ ఏది అయినా అదే ముఖ్యమని ఆయన అన్నారు. ఎపి, తెలంగాణ అదృష్టం మారాలంటే తెలుగుదేశం, బిజెపి ప్రభుత్వాలు రావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications