బాబును వెంకటేశ్వరుడు ఎందుకు కాపాడాడంటే, జగన్ వినాలి: లక్ష్మీపార్వతి కొత్త కథ
గుంటూరు: సీఎం చంద్రబాబుపై వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి ఆదివారం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ ప్లీనరీ రెండో రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్థసారథి వైసిపి నాయకుల మీద దాడులపై తీర్మానం ప్రవేశ పెట్టారు.
దీనిని లక్ష్మీ పార్వతి బలపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చంద్రబాబు పాపిష్టి వ్యక్తి అని, పాపాత్ముడి పాలన అని మండిపడ్డారు. ఆయన పాపాత్ముడు కాబట్టే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు ఆయనను తన వద్ద చావనీయలేదన్నారు. అల్లుడి గురించి అత్తనే చెప్పాలన్నారు.

పాపాత్ముడు కాబట్టే..
చంద్రబాబు నాయుడు పాపాత్ముడు కాబట్టే గతంలో ఆయన పాలించిన తొమ్మిదేళ్లలో ఒక్క ఏడాది కూడా వర్షం పడలేదని లక్ష్మీపార్వతి అన్నారు. వైయస్ పుణ్యాత్ముడు కాబట్టే చనిపోయినా ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు. చంద్రబాబు పాపాత్ముడి పాలన కొనసాగుతోందన్నారు. వైయస్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా వర్షం వచ్చిందన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన దేవుడు అన్నారు. చంద్రబాబు ఆస్తులపై స్టే తెచ్చుకున్నారని, అది తెచ్చుకున్న ఆరు గంటల్లోనే ఎన్టీఆర్‌కు గుండెపోటు వచ్చిందని లక్ష్మీపార్వతి అన్నారు.

జగన్.. వినాలి.. రంగా హత్య, వైయస్ మృతి
తన భర్త ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు హత్యా రాజకీయాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలున్నాయని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాపులకు హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎదురు తిరిగి వారిపై కేసులు పెడుతున్నారన్నారు

అలిపిరిపై బాబు అలా అన్నారు కానీ..
అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ ప్రమాదంలో తాను ప్రాణాలతో బయటపడ్డానని, తాను ఈ రాష్ట్రానికి ఇంకా ఏదో చేయాలని వెంకటేశ్వర స్వామి భావించారు కాబట్టే తనను కాపాడాడని చంద్రబాబు ఓ సభలో చెబుతుంటే విన్నానని, కానీ అసలు విషయం అది కాదని లక్ష్మీపార్వతి అన్నారు. శ్రీ వెంకేటశ్వర స్వామి వారు ఓ భక్తుడికి కలలో వచ్చి చంద్రబాబును ఎందుకు కాపాడాడో చెప్పారని ఆమె వివరించారు. ఏదో పని చేయాలని చంద్రబాబును నేను (వెంకటేశ్వరుడు) కాపాడానని చెబుతున్నాడని, కానీ అటువంటి పాపిష్టి తన వద్ద చనిపోతే అక్కడ అతనికి సమాధి కడతారని, తన వద్దకు వచ్చే భక్తులు ఆ పాపిష్టి సమాధి చూసుకుంటూ వస్తారని, అలాంటి పాపాత్ముడి సమాధి తనకు దగ్గర వద్దని అందుకే కాపాడనని వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడి కలలో చెప్పాడని లక్ష్మీపార్వతి అన్నారు.

జగన్‌ను సీఎం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది
చంద్రబాబు దుష్టపాలన అంతానికి అందరు కూడా ముందుకు రావాలని లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. చంద్రబాబును ఇంటికి పంపి జగన్‌ను సీఎం చేస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటాం
అంతకుముందు, పార్థసారథి మాట్లాడారు. చంద్రబాబు అ
ధికారంలోకి వచ్చాక వైసిపి శ్రేణులపై దాడులు జరుగుతున్నాయన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి టిడిపిలో చేర్చుకున్నారన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా వైసిపిని ఏం చేయలేరన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవడం ఖాయమన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. సుపరిపాలన అందించని చంద్రబాబుపై తాము అధికారంలోకి వచ్చాక ప్రతీకారం, కక్ష తీర్చుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications