రాజధాని తరలింపు- జగన్ సర్కార్ కు లాస్ట్ ఛాన్స్ ? ఫెయిలైతే మళ్లీ గెలవాల్సిందే !
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు సీఎం జగన్ కు ఈ ఏప్రిల్ డెడ్ లైన్ గా కనిపిస్తోంది. ఇందులో విఫలమైతే మరోసారి గెలవాల్సిందే.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలవుతూనే ఉంది. ప్రతీ ఏడాది ఈసారి విశాఖకు రాజధాని అంటూ మూడేళ్లుగా ఊదరగొడుతున్నా.. క్షేత్రస్ధాయిలో మాత్రం ఒక్క ఆఫీసు కూడా తరలించే పరిస్ధితి లేకుండా పోయింది. దీనికి కారణం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే. అయితే ఈ ఏడాది కూడా రాజధాని తరలింపులో విఫలమైతే మాత్రం వైసీపీ సర్కార్ మరోసారి గెలవక తప్పని పరిస్ధితి ఎదురుకాబోతోంది.

రాజధాని తరలింపు
త్వరలోనే ఏపీ రాజధాని తరలింపు.. ఈ మాట గత మూడేళ్లుగా వైసీపీ మంత్రుల నోట వింటూనే ఉన్నాం. పలు సందర్భాల్లో రాజధాని తరలింపుపై ఎదురవుతున్న ప్రశ్నలకు వైసీపీ మంత్రులు ఈ సమాధానం చెబుతూనే ఉన్నారు. కానీ రాజధాని మాత్రం తరలిపోలేదు. దీంతో కొత్త రాజధానులవుతున్న విశాఖ, కర్నూలు ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే రాజధాని తరలింపులో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కాసేపు పక్కనబెడితే ఈ ఏడాది మాత్రం డెడ్ లైన్ గా భావిస్తున్నారు. ఇందులో విఫలమైతే మాత్రం ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.

ఈ ఏప్రిల్ డెడ్ లైన్ ?
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ తుది డెడ్ లైన్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే రాజధాని తరలింపు విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ల విచారణతో సంబంధం లేకుండా ఈ ఏప్రిల్ లో రాజధాని కోసం ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఎందుకంటే ఈ డెడ్ లైన్ మిస్సయితే మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మూడు రాజధానులకు సానుకూలంగా వచ్చినా రాజధాని తరలింపు మాత్రం సాధ్యం కాకపోవచ్చు. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి.

ఉద్యోగుల అనుకూలత
రాజధాని తరలింపులో కీలకం ఉద్యోగులే. సచివాలయంతో పాటు అమరావతిలో ప్రస్తుతం ఉన్న శాఖాధిపతుల కార్యాలయాలు విశాఖకు తరలించాలంటే అందులో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మతించాల్సిందే. అలాగే ఉద్యోగులకు ప్రతీ ఏటా ఏప్రిల్-మే నెలల్లోనే తరలింపుకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువులతో లింక్ అయిన వ్యవహారం కాబట్టి విద్యాసంవత్సరం ముగిసిపోయి, స్కూళ్లకు సెలవులు ఉంటే తరలింపు సులభం అవుతుంది. లేకపోతే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రభుత్వాలు బదిలీల ప్రక్రియను కూడా ప్రతీ ఏటా ఇదే సమయంలో నిర్వహిస్తుంటాయి. దీంతో ఉద్యోగుల అనుకూలత లెక్కన చూసుకుంటే ఏప్రిల్ లో తరలింపు చేపట్టాల్సి ఉంటుంది.

ఈసారి విఫలమైతే మళ్లీ గెలవాల్సిందే ?
ఈ ఏడాది రాజధాని తరలింపు చేపట్టడంలో ఏదైనా కారణంతో విఫలమైతే మాత్రం ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. ఎందుకంటే వచ్చే ఏడాది అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. వాటిలో ప్రభుత్వంతో పాటు ఉద్యోగులు కూడా బిజీగా ఉంటారు. అలాగే ఎన్నికలకు వెళ్లే ప్రభుత్వాన్ని ఉద్యోగులు లైట్ తీసుకోవడం కూడా సర్వసాధారణం. ఎన్నికల విధుల్లో ఉద్యోగులు బిజీగా ఉండాల్సిన పరిస్ధితి. దీంతో తరలింపు ప్రక్రియ వచ్చే ఏడాది కూడా సాధ్యం కాదు. తిరిగి ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే 2025లో తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు వీలు కుదురుతుంది. అధికారం వైసీపీ చేజారితే మాత్రం తిరిగి విపక్షాలు అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల వ్యవహారాన్ని పక్కనపడేసే పరిస్ధితి ఉంటుంది. దీంతో ఈ ఏడాది తరలింపు తప్పనిసరిగా చేపట్టాల్సిన పరిస్దితి వైసీపీ సర్కార్ కు నెలకొంది.












Click it and Unblock the Notifications