గన్నవరం వైసీపీపై తాజా నివేదిక..వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందంటే..?
ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నయి. పార్టీ అధినేతలు, అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా , గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందనేది ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాట్ సీట్లలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఒకటి. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గతంలో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థులే అత్యధికసార్లు విజయం సాధించారు.
వల్లభనేని వంశీ 2014,2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆయన బయటపడటం జరిగింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా.. వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో పాటు, చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీంతో ఎలాగైనా గన్నవరంలో వంశీని ఓడించాలని టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఈక్రమంలోనే గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డను పార్టీలోకి తీసుకువచ్చి వంశీపై పోటీకి దించారు. దీంతో ఇక్కడ గెలుపు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గన్నవరంలో మరోసారి జెండా ఎగరేయాలని టీడీపీ భావిస్తుండగా.. ఈసారి అధికారికంగా గన్నవరం తమది అనిపించుకోవాలని వైసీపీ అనుకుంటుంది. వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే చెప్పాలి.
2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలవగా.. వంశీ వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈసారి వైసీపీ నుంచి గెలిచి గన్నవరంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం.. స్థానికంగా అందరికి అందుబాటులో ఉండటం.. సేవా కార్యక్రమాలు చేయడం వంటివి వెంకట్రావుకు అనుకూల అంశాలని అంటున్నారు. గత ఎన్నికల్లో స్పల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోవడంతో ఈసారి తనదే విజయమనే ధీమా ప్రదర్శిస్తున్నారు. మరోవైపు వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో మంచి పట్టుంది.
దీనికి తోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం.గన్నవరంలో టీడీపీ ఇమేజ్ కన్నా వంశీ వ్యక్తిగత ఇమేజ్‌ను ఎక్కువగా సంపాదించుకున్నారు. ఇప్పటికే వైసీపీలో పట్టు సాధించిన వంశీ... తన బలానికి జగన్ సంక్షేమ ఫలాల మద్దతు తోడయితే గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారు. గెలుపు కోసం ఇరువురు నేతలు గట్టిగానే శ్రమిస్తున్నారు.ఆర్థికంగా ఇద్దరి నేతలు కూడా బలంగా కనిపిస్తున్నారు. వీరిలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనేది చెప్పడం కష్టమే అంటున్నారు పరిశీలకులు. మరి గన్నవరంలో ఈసారి వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications