పవన్ కు డూ ఆర్ డై సిట్యుయేషన్ ? ఆందోళనకరంగా తాజా రిపోర్ట్స్ ! సైలెంటైపోతున్న టీడీపీ, బీజేపీ !
ఏపీలో రాజకీయంగా పుంజుకునేందుకు గత ఏడాది కాలంగా జనసేన పార్టీ చేసిన ప్రయత్నాలు ఆ పార్టీ రాజకీయ తప్పిదాల కారణంగా ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడతానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుగా తన పార్టీ జనసేనను బలోపేతం చేసుకోవడానికి సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపైనా పవన్ కళ్యాణ్ పాటిస్తున్న మౌనం వ్యూహాత్మకమా, రాజకీయ తప్పిదమా అన్నది ఇంకా తేలలేదు. మచిలీపట్నం సభలో దీనిపై క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన ఆశించినంతగా పుంజుకోవడం లేదని తెలుస్తోంది. ఇది అంతిమంగా టీడీపీ-జనసేన పొత్తుపైనా ప్రభావం చూపబోతోంది.

ఏపీలో జనసేన పరిస్దితి
ఏపీలో జనసేన పరిస్దితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఎన్నికల వేళ రాష్ట్రంలోనే ఉంటూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాల్సిన అధినేత కాస్తా హైదరాబాద్ లో సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండిపోతుండటం, పార్టీలో అంతా తానే అన్నట్లుగా నంబర్ టూ నాదెండ్ల మనోహర్ వ్యవహారాలు నడిపిస్తుండటంతో సీనియర్లు, ఇతర నేతలకు నమ్మకం సడలిపోతోంది. దీని ప్రభావం సహజంగానే ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులపై పడుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై పోరాడుతున్న జనసేన పార్టీ.. ఈ మధ్య కాలంలో భారీ స్దాయిలో చేసిన ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ లేవు. రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చే పరిస్దితి లేదు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటున్నా ఉమ్మడి పోరాటాలు కరువయ్యాయి. ఎన్నికల్లో పొత్తుపెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీడీపీ విషయంలోనూ నేతలకు క్లారిటీ లేదు. దీంతో జనసేన ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది.

ఆందోళనకరంగా తాజా సర్వేలు
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఎవరు గెలుస్తారనే విషయంలో తాజాగా ఓ సర్వే సంస్ధ నిర్వహించిన అభిప్రాయసేకరణలో జనసేన పార్టీకి కేవలం 7 సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అదీ కాపుల జనాభా ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లో మాత్రమే. ఓ జిల్లాలో నాలుగు, మరో జిల్లాలో మూడు సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇతర విపక్షాల ఓట్లను చీల్చేందుకు మాత్రమే జనసేన పనికొస్తుందని ఈ సర్వే తేల్చేసింది. దీంతో జనసేన భారీగా ఆశలు పెట్టుకుంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం ఏమాత్రం లేదని తేలిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి గత ఎన్నికల పరిస్దితులు దాపురిస్తారా అన్న భయం ఆ పార్టీ నేతల్ని వెంటాడుతోంది.

జనసేనను కాదని టీడీపీలోకి నేతలు ?
రాష్ట్రంలో తాజాగా ఇద్దరు కాపు నేతలు జనసేనవైపు మొగ్గినట్లే మొగ్గి తిరిగి టీడీపీకి జై కొట్టేశారు. ఈ ఇద్దరు నేతల్ని పార్టీలో చేర్చుకుంటే కనీసం కాపు సామాజిక వర్గం ఓట్లయినా గంపగుత్తగా పడతాయని భావించిన పవన్ కళ్యాణ్ కు.. ఆ ముచ్చటా తీరలేదు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోతే, తాము లీకులిచ్చిన వంగవీటి రాధా సైతం టీడీపీలోనే కొనసాగేందుకు నిర్ణయించారు. ఈ ఇద్దరు నేతల నిర్ణయాలు ఇఫ్పుడు జనసేనపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీల వారీగా చీలిపోయిన కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చే వ్యూహాలు లేకపోగా.. ఇప్పుడు ఇలా కాస్తో కూస్తో పేరున్న నేతలు కూడా టీడీపీవైపు వెళ్లిపోతుంటే జనసేన నిస్సహాయంగా చూస్తోంది.

పవన్ కు ఇక చావో రేవో ?
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితుల్లో టీడీపీతో పొత్తు సంగతేమో కానీ జనసేన ఒంటరిగా సత్తా చాటుకోవడం అసాధ్యమని తేలిపోయింది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కనీస స్ధానాలు బేరమాడే శక్తి కూడా తగ్గిపోతోంది. ఇక చివరికి గోదావరి జిల్లాల్లో పదో, పదిహేనో స్ధానాలు తీసుకుని వాటిలో పోరాడటం మినహా జనసేనకు ఆప్షన్స్ లేకుండా పోతున్నాయి. దీంతో మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ ఏదైనా మ్యాజిక్ చేస్తారా అని నేతలంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వారాహి యాత్ర ప్రారంభమైతే కానీ జనసేన గ్రాఫ్ పెరగడం కష్టమేనన్న అంచనాల మధ్య పవన్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటి నుంచి అయినా పవన్ సీరియస్ గా రాజకీయాలపై దృష్టిపెట్టకపోతే వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ 2019 నాటి చేదు అనుభవాలు రిపీట్ కాక తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications