పవన్ కళ్యాణ్‌కు డిమాండ్, నేతల క్యూ: బెజవాడపై బెట్టు
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఆయన కోసం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. పవన్ ఇప్పటికే పరోక్షంగా టిడిపికి, ప్రత్యక్షంగా బిజెపికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నెల 30వ తేదీన తెలంగాణ ప్రాంతంలో, ఏప్రిల్ 7న సీమాంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ను ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా నేతలు కోరుతున్నారు. సోమవారం ఉదయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనను కలిసి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలతో పాటు కర్నాటకలో బిజెపికి ప్రచారం చేయలని కోరారు.

అందుకు పవన్ సుముఖత చూపారు. అందులో భాగంగా ఆయన రేపు కర్నాటకలో బిజెపి తరఫున ప్రచారం చేయనున్నారు. రాయచూరు, కొల్లూరు తదితర తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ, సీమాంధ్రల్లోను తమ తరఫున ప్రచారం చేయాలని టిడిపి, బిజెపి నేతలు వస్తున్నారు. పవన్ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.
సోమవారం ఉదయం కిషన్ రెడ్డితో పాటు విజయవాడ వెస్ట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొండా ఉమ కలిశారు. తనకు అనుకూలంగా ప్రచారం చేయాలని కోరారు.
పొట్లూరిపై పవన్ పట్టు
మరోవైపు విజయవాడ లోకసభ సీటును పొట్లూరి వర ప్రసాద్‌కు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. పొట్లూరికి ఆ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిళ్లు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంత ఒత్తిళ్లు వచ్చినా కేశినేని నానికే టిక్కెట్ ఇవ్వాలి బాబు నిర్ణయించుకున్నారట. అయితే, పవన్ మాత్రం పొట్లూరి కోసం పట్టుబడుతున్నారట.












Click it and Unblock the Notifications