కుప్పంలో సొంత పార్టీ సెగ, మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ని ?, కబ్జాలు చేసి పర్మనెంట్ బిల్డింగ్స్ !
కుప్పం/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కుప్పం నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం, వైఎస్ ఫ్యామిలీకి పులివెందల ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయకుడికి కుప్పం నియోజక వర్గం అంతే ముఖ్యం అనే విషయం తెలిసిందే. కుప్పం నియోజక వర్గం మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కువ శ్రద పెట్టిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కుప్పం చరిత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓడిపోయిన సంఘటనలు చాలా తక్కువ. అలాంటిది కుప్పం మునిసిపాలిటి అయిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించిన వైఎస్ఆర్ సీపీ కుప్పం మునిసిపాలిటిలో జెండా ఎగరవేసింది. అందుకు ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అందరూ అంటున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పక్కాలేక్కలు వేసుకుని ఆయన ప్రభావంతోనే కుప్పం మునిసిపాలిటి ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని కుప్పం ప్రజలు అంటున్నారు. అలాంటిది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత పార్టీకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఊహించని ఝలక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
కుప్పం పర్యటనకు వెళ్లిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజక వర్గంలోని గుడుపల్లె మండలంలోని మల్లప్ప కొండపై జరిగే కుంబాభిషేకం ఉత్సవాలకు హాజరుకావాడానికి బయలుదేరారు. మార్గం మధ్యలో శాంతిపురం మండలం మొరసనపల్లె పంచాయితీకి చెందిన వైసీపీ సర్పించి జగదీష్, ఎంపీటీసీ ఆర్ముగంతో పాటు వైసీపీకి చెందిన చాలా మంది నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు కలిసి మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ని కుప్పం-పలమనేరు జాతీయ రహదారి మీద అడ్డుకున్నారు.

ఆ సందర్బంలో వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించడంతో సొంత పార్టీ కార్యకర్తలు ఎదురుతిరగడంతో పరిస్థితి అదుపుతప్పింది. తరువాత కారు దిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నాయకుల దగ్గర వినతిపత్రం తీసుకున్నారు. సొంత పార్టీ నాయకుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో కంగుతిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరువాత ఆర్డీఓను పిలిచి వీరి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో ఆర్డీఓ వైసీపీ నాయకులు నిర్మిస్తున్న కట్టడాలను పరిశీలించారని తెలిసింది.












Click it and Unblock the Notifications