భయాందోళనల్లో శ్రీవారి భక్తులు- సీసీటీవీల్లో రికార్డు
Tirumala: గత ఏడాది తరహాలోనే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరించింది. ఈ మార్గంలో ఉన్న కంట్రోల్ రూమ్ సమీపంలో హల్‌చల్ చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం అధికారులు విడుదల చేశారు.
శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి తాజాగా ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత ఏడాది చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసిన విషయం తెలిసిందే. అలిపిరి, శ్రీవారిమెట్లు, గాలిగోపురం పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి అప్పట్లో.

వాటిని కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం ఏడు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు అప్పట్లో.
గత ఏడాది అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. కాలినడకన తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను చిరుత బారిన పడకుండా ఉండటానికి తక్షణ రక్షణగా చేతికర్రలను అందించింది అప్పటి పాలక మండలి.
ఇప్పుడు మరోసారి చిరుతల బెడద మొదలైంది. శ్రీవారి మెట్టు సమీపంలో చిరుత సంచరించించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 27వ తేదీ అంటే శుక్రవారం రాత్రి 10:05 నిమిషాల సమయంలో చిరుత సంచారం రికార్డయింది.
ఆ మార్గంలో వీధి కుక్కలను చిరుత తరమడం ఈ వీడియోల్లో స్పష్టంగా చూడొచ్చు. కంట్రోల్ రూమ్ ప్రధాన మార్గంలో కొద్దిసేపు చిరుత తిరుగాడినట్లు తేలింది. దీన్ని పసిగట్టిన సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తం అయ్యారు. కార్యాలయానికి తాళం వేసి కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications