తిరుమలలో మళ్లీ చిరుత కలకలం- ఆ మార్గంలో హుషార్
Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసింది. అలిపిరి పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి సంచారాన్ని గుర్తించారు.
అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం ఏడు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు అప్పట్లో. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

గత ఏడాది అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. కాలినడకన తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను చిరుత బారిన పడకుండా ఉండటానికి తక్షణ రక్షణగా చేతికర్రలను అందించింది అప్పటి పాలక మండలి. ఆ తరువాత చిరుతల సంచారం పెద్దగా కనిపించలేదు.
ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత సంచరించినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు. ఈ మార్గంలో ఉన్న కంట్రోల్ రూమ్ సమీపానికి శనివారం రాత్రి చిరుత వచ్చింది. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్ కంట్రోల్ రూమ్‌లోనే ఉన్నారు.
కంట్రోల్ రూమ్ సమీపానికి చిరుత వచ్చినట్లు పసిగట్టిన సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తం అయ్యారు. కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. కొంతసేపు ఆ చిరుత అక్కడే తిరుగాడినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. సమాచారం అందిన వెంటనే టీటీడీ అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications