వారికి జీవిత ఖైదు..కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్ వార్నింగ్!
దేశంలో విమానాలకు బెదిరింపులు పెరిగిపోయిన వేళ విమానాల బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా వారిని నో ఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానయాన భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
అక్టోబర్ 14 నుంచి ఇప్పటివరకు దాదాపు 100 బెదిరింపు కాల్స్
నేడు ఇదే విషయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అక్టోబర్ 14 నుంచి ఇప్పటివరకు పలు విమానాలకు దాదాపు 100 బెదిరింపు కాల్స్ వచ్చాయని, బెదిరింపు కాల్స్ విషయంలో పలు వర్గాలతో సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్ చేసే వారి పైన చర్యలకు, అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారి పైన చర్యలు తీసుకునే లాగా చట్టాలలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఆ బెదిరింపు కాల్స్ అన్నీ బూటకం
ఇప్పటివరకు వచ్చిన బెదిరింపు కాల్స్ అన్ని బూటకమని తేలిందని ఆయన పేర్కొన్నారు. విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చిన సమయంలో పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుందని, విమానయాన శాఖకు చాలా కఠినమైన ప్రోటోకాల్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ విధివిధానాలను అనుసరించి నడవాల్సి ఉంటుందన్నారు.
వారికి జీవిత ఖైదు విధించేలా చట్టంలో మార్పులు
ఈ క్రమంలోనే విమానాల బెదిరింపు కాల్స్ చేసేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటికే విమానంలో బోర్డింగ్ అయిన తర్వాత బెదిరింపులకు పాల్పడే వారికి జీవిత ఖైదు విధించేలా చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నాయని పేర్కొన్న కేంద్ర విమానా శాఖ మంత్రి ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడే వారిపై కూడా వీటిని వర్తింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ప్రయాణికుల భద్రతే ముఖ్యం
విమానయాన భద్రతా నిబంధనల సవరణ అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. విమాన భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని, ప్రయాణికుల ప్రాణాలే తమకు ముఖ్యమని తెలిపారు. రానున్న రోజులలో మెరుగైన పరిస్థితిని చూస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
హోంశాఖ తో పాటు ఇతర ఏజెన్సీ లతో ఈ బెదిరింపు కాల్స్ పైన దర్యాప్తు
ఇక విమానాలకు బెదిరింపులు వస్తున్న క్రమంలో ఒక్క విమానాన్ని కూడా దారి మళ్ళించాలనో, జాప్యం చేయాలనో తాము అనుకోవడంలేదని తక్షణం స్పందించి, సమర్థవంతంగా వేగంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హోంశాఖ తో పాటు ఇతర ఏజెన్సీ లతో ఈ బెదిరింపు కాల్స్ పైన దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు. విమానాల బెదిరింపు కాల్స్ చేసే ఎవరిని సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉగ్ర కోణంలో విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయన్న అంశాన్ని ఆయన తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications