బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
వేసవిలో ఏపీని చిరుజల్లులు, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పలకరిస్తోన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు చోట్ల ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ- రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు క్రమంగా తగ్గి, ఎండ తీవ్రత రెట్టింపు అవుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నంద్యాల, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు ప్రకాశంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం వరకు అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడరాదని చెప్పారు. పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని అన్నారు.
నేడు విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగరల్లో వడగాల్పులు వీస్తాయని ప్రఖర్ జైన్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరంతో పాటు 70కి పైగా గ్రామాల్లో 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. శనివారం నాడు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ 42.4 డిగ్రీల ఎండ కాసింది. మార్కాపురం జిల్లా నందనమారెల్ల- 42.3, కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.












Click it and Unblock the Notifications