ఎన్నికల వేళ ఏపీ బీజేపీకి శీలపరీక్ష ? వైసీపీతో స్నేహం లేదని చెప్పుకునేందుకు పాట్లు !
ఏపీలో 2019లో వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో స్నేహం మొదలుపెట్టిన బీజేపీకి ఇప్పుడు ఎన్నికలకు ముందు అదేమీ లేదని నిరూపించుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. ఇప్పటికే వైసీపీతో పరోక్ష స్నేహం కారణంగా మిత్రపక్షం జనసేన కూడా దూరమయ్యే పరిస్దితి వచ్చేసింది. దీంతో బీజేపీ కేవలం జనసేనతోనే టచ్ లో ఉందని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో ఛార్జిషీట్లు, కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఫిర్యాదులు చేస్తామంటూ హెచ్చరికలు చేస్తోంది.
ఏపీలో నాలుగేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ కేంద్రంతో సత్సంబంధాలు నెరపాలన్న ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోడీకి దగ్గరయ్యారు. అప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చి కేంద్రంపై ధర్మపోరాటం చేయడం, ఎన్నికల్లో ఓటమి పాలైన పరిస్ధితుల్లో ఆ స్ధానాన్ని భర్తీ చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో కేంద్రంలో తనలాగే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీతో స్నేహం వైసీపీకి అత్యవసరంగా మారిపోయింది.

ఈ నాలుగేళ్లలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రాజెక్టు కానీ, నిధులు కానీ రాబట్టుకోవడంలో విఫలమైన వైసీపీ. తప్పనిసరి పరిస్ధితుల్లో ఆ పార్టీని విమర్శించలేక మౌనంగా ఉండిపోతోంది. అదే సమయంలో సీఎం జగన్ పై ఉన్న సీబీఐ కేసులు కూడా వైసీపీకి ఇందుకు అడ్డంకిగా మారాయి. ఈ బలహీనతను సొమ్ముచేసుకుంటూ నాలుగేళ్లుగా బేషరతుగా వైసీపీ మద్దతు తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల ముందు తమను తాము నిరూపించుకోవాల్సిన పరిస్ధితి వచ్చేసింది.
దీంతో ఎన్నికలకు ముందు వైసీపీపై క్రమంగా బీజేపీ కత్తులు నూరుతోంది. ఏపీ బీజేపీ నేతలు తాజాగా వైసీపీ పాలనపై ఛార్జిషీట్లు విడుదల చేస్తామని, వైసీపీ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఫిర్యాదులు చేస్తామని హెచ్చరికలు ప్రారంభించారు. అయినా వైసీపీ ఏమీ చేయలేని పరిస్ధితి. ఇదే అదనుగా తమను తాము నిరూపించుకునేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్రంలోనూ మద్దతు లభించే పరిస్ధితి లేదు. అయినా ఎన్నికలకు ముందు ఏదో ఒకటి చేసి వైసీపీపై తాము కూడా పోరాడుతున్నామన్న భావన కలిగిస్తే తప్ప మిత్రపక్షం జనసేన కూడా తమను నమ్మదనే భావనలోకి కాషాయ నేతలు వెళ్లిపోతున్నారు.












Click it and Unblock the Notifications