పోలవరం నిర్వాసితులను జల సమాధి చేస్తున్న జగన్ రెడ్డి ; గాలిమాటలు చెప్పే గాలిగాడు : డోసు పెంచి లోకేష్ ధ్వజం !!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండవ రోజు పోలవరం ముంపు గ్రామాల పర్యటన కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఇచ్చిన నాలుగు వేల కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి తినేసాడు అని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు లోకేష్. గాలి మాటలు చెప్పిన గాలిగాడు అంటూ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నిర్వాసితులకు న్యాయం జరగడం కోసం చివరి వరకూ పోరాటం చేస్తానని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే టార్గెట్ చేస్తూ జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెడుతున్నారు.

ముంపు గ్రామాలలో కొనసాగుతున్న నారా లోకేష్ పర్యటన
తూర్పుగోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాలలో పర్యటనలో భాగంగా నారా లోకేష్ ముంపు బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ రోజు కూడా లోకేష్ పర్యటన సందర్భంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. పోలవరం ముంపు గ్రామాల పర్యటనలో భాగంగా నేడు దేవీపట్నం, రంపచోడవరం, పెద్ద వేంపల్లి, కృష్ణుని పాలెం, ఇందుకూరు , ముసిరి గుంట ప్రాంతాలలో లోకేష్ పర్యటిస్తున్నారు. ఇప్పటికే పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు లోకేష్ కు తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. రెండు సంవత్సరాలుగా వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, జగన్ ప్రభుత్వం ఏ మాత్రం సహాయం చేయడం లేదని వారు లోకేష్ కు తమ గోడు వినిపిస్తున్నారు.

పోలవరం నిర్వాసితులను జగన్ రెడ్డి జల సమాధి చేస్తున్నారు
ఇదే సమయంలో నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను ముంపు గ్రామాల నిర్వాసితులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికలకు ముందు పోలవరం ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుతం పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగన్ సర్కారు తీరు పై విరుచుకుపడ్డ లోకేష్ మోసపు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి నిలువునా మోసపోయారని, ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా బెదిరించి ఊళ్ళన్నీ ఖాళీ చేయిస్తున్నారని, నిర్వాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులను జగన్ రెడ్డి జల సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. నిర్వాసితుల త్యాగాల ఫలితమే పోలవరం అని అభిప్రాయపడ్డారు.

చిట్టచివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా
ఇది కేవలం 1.90 లక్షల మంది కి సంబంధించిన చిన్న సమస్య మాత్రమేనని వైసిపి నాయకులు అంటున్నారని, ఇది చాలా పెద్ద సమస్య అంటూ లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల సమస్యని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, చిట్టచివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకూ తాను ఈ పోరాటంలో ముందుంటాను అంటూ పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల తరపున పోరాడి న్యాయం జరిగేలా చూస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పిల్ వే గేట్లు పెట్టడానికి చూపిన శ్రద్ధ నిర్వాసితులను ఆదుకోవడానికి పెట్టలేదని అభిప్రాయపడ్డారు.

జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే.. ముంపు గ్రామాల ప్రజలతో లోకేష్
ఈరోజు గ్రామాలన్నీ జలసమాధిగా మారడం బాధాకరంగా ఉందని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి 2016 లో ఎకరానికి 19 లక్షలు ఇస్తానన్నాడని, మళ్లీ తొమ్మిది లక్షలు కట్ చేసి పాదయాత్రలో 10 లక్షలు ఇస్తానని చెప్పాడని, ఆ తర్వాత వాటిని మింగేశాడు అంటూ నిప్పులు చెరిగారు. భూమికి భూమి ఇస్తానని చెప్పిన మాటలు గాలిలో కలిసిపోయాయి అన్నారు. 25 రకాల వసతులతో నిర్వాసితుల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఆ పని చేయలేదని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితుల విషయంలో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని విరుచుకుపడుతున్న లోకేష్, ఈ రోజు కూడా పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ నిర్వాసితులు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications