చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్: బాధ కలిగించిందంటూ కేటీఆర్
హైదరాబాద్: తెలుగు పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన తనయుడు నారా లోకేష్ చేసిన ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ అన్నారు. తనకు కూడా ఆ బాధ తెలుసని చెప్పారు.
'కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నాం' అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన ఎండవేడిమితో ఆయన అస్వస్థతకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేత లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే వైఎస్ జగన్‌దే బాధ్యత అని అన్నారు లోకేష్. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారన్నారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు, ఎదుర్కొంటున్నారు. దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్, అలర్జీతో బాధపడుతున్నారు అని లోకేష్ ట్వీట్ చేశారు.

చంద్రబాబు మొదట డీహైడ్రేషన్ కు గురికాగా, ఆ తర్వాత ఛర్మ సంబంధిత అస్వస్థతకు గురయ్యారు. దీంతోప్రభుత్వ వైద్యులు ఆయనను పరీక్షించి అవసరమైన మందులు అందించారు.చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు, జైల్ అధికారులు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications