ఏపీ నుంచి లోక్ సత్తా జేపీ పోటీ - పొత్తుకు సిద్దం: మారుతున్న సమీకరణాలు..!!
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికలకు ఇప్పటికే అధికార - ప్రతిపక్షాలు కార్యాచరణ మొదలు పెట్టాయి. ఇదే సమయంలో ఏపీలో రాజకీయంగా ఉన్న అవకాశాలను తమకు అనుకూలంగా మలచుకోవటానికి కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా..ఇప్పుడు లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం అవుతోంది. ఇందుకోసం లోక్ సత్తా రాష్ట్ర పార్టీ తీర్మానం చేసింది.

ఏపీ నుంచి జేపీ పోటీకి సిద్దం
ఏపీలో ప్రత్యేక హోదా..విభజన హామీల సాధానకు జయప్రకాశ్ ఏపీ నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలని పార్టీ తీర్మానంలో స్పష్టంగా పేర్కొంది. ఇందుకోసం కలిసొచ్చే వారితో రాజకీయ వేదిక పంచుకొనేందుకు సిద్దంగా ఉన్నామని పార్టీ ప్రకటించింది. దీని పైన పార్టీలో పెద్ద ఎత్తున సంప్రదింపులు - చర్చలు జరిగాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఎవరితో పొత్తు కుదుర్చుకుంటాయో అనేది అధికారికంగా తేలాల్సి ఉంది. లోక్ సత్తా పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. జనసేన- టీడీపీ మధ్య పొత్తు లేకుంటే జనసేన తో కలిసి పోటీ చేయటానికి లోక్ సత్తా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ - టీడీపీ తో కలిసి జనసేన పొత్తు ఖరారైతే లోక్ సత్తా రెండో ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో సీబీఐ జేడీ..ఇప్పుడు జేపీ
అందులో భాగంగా.. ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీతో కలిసి ముందుకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జేపీ ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఆదరణ ఉంటుందని లోక్ సత్తా నేతలు అంచనా వేస్తున్నారు. ఇందు కోసం ప్రస్తుతం రాజకీయ కేంద్రంగా మారిన విశాఖ నుంచి పోటీ చేస్తే సమీకరణాలు కలిసి వస్తాయని విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పరిస్థితులు అక్కడ భిన్నంగా ఉండటంతో..జేపీకి కలిసి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతల అభిప్రాయం. లోక్ సత్తా జేపీ 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని కుకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ పార్టీ నుంచి ఆయన ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పొత్తుల తరువాతే నిర్ణయం
ఆ తరువాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన జేపీ తరచూ స్పందిస్తున్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరును జేపీ ఆక్షేపించారు. రాజధానులు మార్చే అధికారం రాష్ట్రాని లేదంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్దిక పరిస్థితి పైనా ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రకాశం జేపీ సొంత జిల్లా అయినా..ఇప్పుడు ఎంపీగానే పోటీ చేయాల్సి ఉండటంతో విశాఖ లేదా విజయవాడ నుంచి పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయంగా చోటు చేసుకొనే సమీకరణాలు.. పొత్తుల విషయంలో స్పష్టత వచ్చే క్రమంలో జేపీ అధికారికంగా ఏపీలో తన పోటీ పైన అధికారకంగా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications