బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం- ఏపీలో భారీ వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది.
నెల్లూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో నైరుతి దిశను ఆనుకుని పశ్చిమ మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తు నిర్వహణ విబాగం తెలిపింది.
ప్రస్తుతం ఈ అల్పపీడనం బలహీనపడిందని, క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు- దక్షిణకోస్తా తీరం వైపు చేరుతుందని ఎస్డీఎంఏ పేర్కొంది. అనంతరం వచ్చే 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి సాగుతుందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.












Click it and Unblock the Notifications